“బంగార్రాజు’ సినిమా సంక్రాంతి బరిలో ప్రతి ఒక్కరిని అలరిస్తుందని చెప్పారు నాగార్జున. ప్రేక్షకులందరికి ఓ పండగలాంటి అనుభూతిని కలిగిస్తుందన్నారు. తనయుడు నాగచైతన్యతో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’ నేడు విడుదలవుతున్నది. ఈ సందర్భంగా గురువారం నాగార్జున పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
‘బంగార్రాజు’ ఎలా ఉండబోతున్నది?
‘సోగ్గాడే చిన్ని నాయనా’ పెద్ద విజయం సాధించింది కాబట్టి.. సీక్వెల్‌గా వస్తున్న ‘బంగార్రాజు’ మీద అంచనాలు ఎక్కువయ్యాయి. తొలిభాగం కంటే మరింత గొప్పగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ‘ఈ సినిమా ఓ పండగలా ఉంటుంది’ అని అనేక సందర్భాల్లో చెప్పాను. ఆ మాటల్ని నిజం చేస్తూ అందరి మోముల్లో నవ్వుల్ని పండించే చిత్రమవుతుంది.
నాగచైతన్యను చిన్న బంగార్రాజు పాత్ర కోసం తీసుకోవడానికి కారణమేమిటి?
రక్తసంబంధం అనేది తెలుగు తెరపై విజయవంతమైన వాణిజ్యసూత్రం. తండ్రీకొడుకులు కలిసి తెరపై కనిపిస్తే ఆ సినిమా ప్రభావం మరోస్థాయిలో ఉంటుంది. నాన్న ఏఎన్నార్‌తో కలిసి నేనూ కొన్ని సినిమాల్లో నటించాను. అవి బాగా ఆడాయి. ‘బంగార్రాజు’ తాతమనవడి కథ కాబట్టి సీక్వెల్లో నాగచైతన్య అయితే బాగుంటుందనుకున్నాం. నాగచైతన్యను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కథను సిద్ధం చేశారు. ‘మనం’ సినిమాను తీసుకుంటే..అందులో అక్కినేని ఫ్యామిలీ హీరోలు కాకుండా వేరే ఆర్టిస్టులు ఉంటే అంతటి ఆదరణ సాధ్యమయ్యేది కాదు. ఒకే కుటుంబంలోని మూడుతరాల హీరోలున్నారు కాబట్టే ప్రేక్షకులు కథతో బాగా కనెక్ట్ అయ్యారు.
‘బంగార్రాజు’కు సీక్వెల్ తీసే ఆలోచన ఏమైనా ఉందా?
సీనియర్ బంగార్రాజు ఆత్మ ఎక్కడికైనా రావొచ్చు. కథలో సీక్వెల్స్‌కు సరిపోయే ఆసక్తికరమైన అంశాలున్నాయి. ‘బంగార్రాజు’ విడుదలైన వారం తర్వాత సీక్వెల్ గురించి ఆలోచిస్తాం.
చిన్న బంగార్రాజు పాత్ర విషయంలో చైతూకి ఎలాంటి సలహాలిచ్చారు?
‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాను చైతూ నాలుగైదుసార్లు చూసి బంగార్రాజు పాత్ర తీరుతెన్నుల మీద అవగాహన పెంచుకున్నాడు. గోదావరి యాసలో సంభాషణల్ని ఎలా పలకాలనే విషయంలో చైతూకి సహాయం చేశాను. తన పాత్ర తాలూకు సంభాషణల్ని మొత్తం నేను మాట్లాడి..ఆ రికార్డ్‌ను చైతూకు పంపించేవాడిని. ఈ సినిమాలో చైతూ పాత్రను చూసి అందరూ ఆశ్చర్యపోతారు.
మీరు ట్రెండీగా ఉంటూనే పల్లెటూరి పాత్రల్లో బాగా ఒదిగిపోతుంటారు?
ఆ విద్య నాన్నగారి నుంచి నాకు వారసత్వంగా వచ్చింది. ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అల్లరి అల్లుడు వంటి సినిమాల్లో నేను గ్రామీణ పాత్రల్లో మెప్పించా. పల్లెటూరి పాత్రల్లో ఓ పొగరుబోతుతనం..ఏదో తెలియని ఆకర్షణ ఉంటాయి. అందుకే కెరీర్ ఆరంభం నుంచి పల్లెటూరి పాత్రలపై ఇష్టాన్ని పెంచుకున్నా.
ఈ ఏడాది సంక్రాంతి రేసులో ఇదే పెద్ద సినిమా కావడం ఎలాంటి అనుభూతినిస్తున్నది?
ఇది ఖచ్చితంగా పండగ సినిమా. సంక్రాంతి పండగకే రిలీజ్ చేయాలని మొదలుపెట్టిన రోజునే నిర్ణయించుకున్నాం. ఆగస్ట్‌లో సినిమాను ఆరంభించాం. అప్పుడే సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని టీమ్ అందరికి చెప్పాం. ఒకవేళ పండక్కి రాలేకపోతే వాయిదా వేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌కే విడుదల చేద్దామనుకున్నాం.
ఏపీలో టికెట్ రేట్ల వివాదాలు నడుస్తున్నా మీరు కాన్ఫిడెంట్‌గా సినిమా రిలీజ్ చేస్తున్నారు..?
ఏపీలో టికెట్ రేట్ల సవరింపు జీవోను ఏప్రిల్‌లో తీసుకొచ్చారు. అలాగే తెలంగాణలో కూడా ఇటీవలే కొత్త జీవోను విడుదల చేశారు. ఈ రెండింటిని బేరీజు వేసుకొని మా సినిమా వర్కవుట్ అవుతుందా లేదా అని ఆలోచించాం. మా అన్నపూర్ణ సంస్థలో రెగ్యులర్‌గా సినిమాలు తీస్తుంటాం కాబట్టి మార్కెట్ లెక్కలపై మంచి అవగాహన ఉంది. బడ్జెట్‌కు అనుగుణంగా లెక్కలు వేసుకొని చూసుకున్నాం. ‘బంగార్రాజు’ సేఫ్ అనిపించింది. సినిమా బాగుంటే ఎప్పుడైనా వర్కవుట్ అవుతుంది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే బోనస్‌గా డబ్బులొస్తాయి. అదీగాక కరోనా వల్ల రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్నాం. ఇంకా ఎన్ని రోజులు నిరీక్షించాలనిపించింది. అందుకే ధైర్యంగా సంక్రాంతి టైమ్‌లో ముందుకొస్తున్నాం.
‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో అనుష్క కనిపిస్తుంది. అలాంటి సర్ప్రైజ్లు ‘బంగార్రాజు’లో ఏమైనా ఉన్నాయా?
చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. అవేమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది.
మీరు వ్యక్తిగతంలా ఆత్మల వంటి శక్తుల్ని నమ్ముతారా?
చిన్నప్పటి నుంచి మనందరం ఆత్మల తాలూకు కథల్ని వింటూ పెరిగాం. నిజంగా అవి ఉన్నాయో లేదో తెలియదు. కానీ అలాంటి కథలు చెబుతున్నప్పుడు ఆసక్తిగా వినేవాన్ని. ఆత్మ కథాంశాలతో వచ్చిన సినిమాలు కూడా బాగా నచ్చేవి. ఆ ఇంట్రెస్ట్ కారణంగానే ‘సోగ్గాడే చిన్నినాయనా’ కథ చెప్పగానే వెంటనే అంగీకరించా.
నాన్నగారు ఏదో రూపంలో మీ దగ్గరే ఉన్నారని నమ్ముతారా?
వందశాతం నమ్ముతాను. మా ఫ్యామిలీలో అందరూ ఈ విషయాన్ని విశ్వసిస్తారు. మా కుటుంబంలో ఎవరైనా ఒత్తిడితో ఉన్నా, ఏమైనా సమస్యల్ని ఎదుర్కొంటున్నా ‘అంతా నాన్నగారు చూసుకుంటారులే’ అని అందరం ధీమాగా ఉంటాం.
సినిమా పరిశ్రమ గురించి మీరు, చిరంజీవి మొదటి నుంచి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు..ఈ రోజు చిరంజీవిగారు ఏపీ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో మీరెందుకు పాల్గొనలేక పోయారు?
చిరంజీవి, నేను ఇండస్ట్రీ సమస్యల గురించి తరచుగా మాట్లాడుకుంటాం. ఏపీ సీఎంతో భేటీ గురించి చిరంజీవిగారు నాకు వారం క్రితమే చెప్పారు. ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్ ఉండటం వల్ల నేను ఆయనతో వెళ్లలేకపోయా. ఎవరు ఏం చేసినా అందరి కోసమే కదా..సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తే బాగుంటుందని కోరు కుంటున్నా.