‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనగానే మగవాళ్లు ఎలా ప్రెగ్నెంట్ ఎలా అవుతారు? అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది’ అన్నారు కథానాయకుడు అక్కినేని నాగార్జున. ‘బిగ్‌బాస్’ఫేమ్ సోహైల్, రూపా కొడవయూర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. అప్పిరెడ్డి, రవిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్ వేడుక శనివారం జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ‘బిగ్‌బాస్‌లో కప్పు గెలవకుండానే విన్ అయ్యాడు సోహైల్. అతను చాలా తెలివైనవాడు. అతనిలో తపన, పట్టుదల వుంది. డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. తప్పకుండా ఈ చిత్రం సోహైల్‌తో పాటు టీమ్ అందరికి మంచి విజయం అందిస్తుందని అనిపిస్తుంది’ అన్నారు. నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ ‘నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. బిడ్డను కనేందుకు నా భార్య పడే కష్టాన్ని చూశాను. ఆ భాదను తట్టుకునే శక్తి మహిళలకే వుంది. ఈ సినిమాలో మేల్ ప్రెగ్నెంట్ అనే కొత్త అంశాన్ని టచ్ చేశాం. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది’ అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయకుడు సోహైల్ ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.