అక్కినేని ఫ్యామిలీ హీరోలు వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగార్జున ప్రస్తుతం ఘోస్ట్ అనే సినిమాతో పాటు బంగార్రాజు అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకి సిద్ధం కాగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ సెట్స్ పై ఉంది. ఇక నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా రూపొందుతోంది.
దిల్ రాజు నిర్మిస్తున్న థ్యాంక్యూ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ మధ్య ఇటలీ వెళ్లి కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించుకుని వచ్చారు. మరి కొద్ది రోజులలో మిగతా షూటింగ్ కూడా పూర్తి చేయనున్నారు. చిత్రంలో చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో చైతూ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టు చెబుతున్నారు.
వయస్సు పరంగా చైతూ మూడు దశలలో కనిపిస్తాడని అంటున్నారు. గతంలో ఈ తరహా పాత్రలను ఆయన ‘ప్రేమమ్’ సినిమాలో పోషించాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక చైతూ తాజా చిత్రంగా త్వరలో ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ సినిమా షూటింగులోను పాల్గొన్నాడు.