‘ఇందులో నా పాత్ర పేరు ‘పార్వతి’. కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా వెళ్లే వ్యక్తిత్వం ఆమెది. వేద విద్యార్థిగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం రెడీ అవ్వడానికి రెండు గంటలు పట్టేది. కథలో కీలకమైన పాత్ర. పార్వతి తీసుకొనే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. అరుదుగా దొరికే పాత్ర ఇది’ అని తెలిపింది నటి నభా నటేష్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. విరాట్‌కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక అడ్వెంచర్ థ్రిల్లర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నభానటేష్ విలేకరులతో మాట్లాడింది. ‘అభిషేక్‌నామా క్లియర్ విజన్‌తో ఈ సినిమా తీశారు. కాస్ట్యూమ్స్, హెయిర్ ైస్టెల్.. ఇలా చిన్న చిన్న విషయాల్లోనూ శ్రద్ధ తీసుకున్నారు.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకున్నారు. ఈ సినిమా కోసం నిర్మించిన అనంతపద్మనాభస్వామి ఆలయం సెట్ అద్భుతం. నిజంగా నిజమైన ఆలయాన్నే తలపించింది. 5వేల మంది డాన్సర్స్‌తో గణేష్ ఆచార్య మాస్టర్ నేతృత్వంలో నాపై చిత్రీకరించిన ‘నమోరే..’ సాంగ్ విజువల్ ఫీస్ట్‌గా ఉంటుంది. అంతపెద్ద కాన్వాస్‌పై పాట చిత్రీకరించడం ఒక ఛాలెంజ్’ అని పేర్కొన్నది నభా నటేష్.
ఈ సినిమా కోసం దాదాపుగా పది సెట్లు నిర్మించారని, ప్రతి సెట్ ఒకదానికొకటి భిన్నంగా ఉంటుందని, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని నిర్మించారని, ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేశారని, అనంతపద్మనాభస్వామి రథయాత్ర కాన్సెప్ట్ జనాన్ని ఆకట్టుకున్నదని నభా నటేష్ చెప్పారు. విరాట్‌కర్ణ డెడికేషన్ ఉన్న నటుడని, కష్టపడి నటించాడని, తనకు ఈ సినిమాతో మంచి పేరొస్తుందని, సౌందర్‌రాజన్ సినిమాటోగ్రఫీ, వీఎప్ఎక్స్ వర్క్ రియల్‌గా అనిపిస్తాయని నభానటేష్ పేర్కొన్నది.