అక్కినేని కుటుంబం అంటేనే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌కి పెట్టింది పేరు. అప్పటి ఏఎన్నార్ నుంచి ఇప్పటి అఖిల్ వరకూ అందరూ అమ్మాయిల కలల రాకుమారులే. 90ల్లో నాగార్జునకు అమ్మాయిలు పెట్టిన ముద్దుపేరు గ్రీకువీరుడు. అందుకే అప్పటి అబ్బాయిలందరికీ నాగ్ రోల్‌మోడల్. అలాంటి నాగార్జున, తన ఇమేజ్‌కి పూర్తి భిన్నంగా చేస్తున్న సినిమా ‘నా సామిరంగ’. సిక్స్టీప్లస్లో కూడా మోస్ట్ హ్యాండ్సమ్ లుక్‌తో మెరిసిపోయే నాగ్, ఈ సినిమాకోసం రగ్గ్డ్గా మారారు.
మాస్ ప్రేక్షకులనే లక్ష్యంగా చేసుకొని ఆయన ఈ సినిమా చేస్తునట్టు ప్రచార చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. విజయ్ బిన్నీ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ప్రతీకారనేపథ్యంలో ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని, కెరీర్లోనే చేయనటువంటి భిన్నమైన పాత్రను ఈ సినిమాలో నాగ్ చేస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. అందుకే ఈ నెల 7 నాటికి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. అల్లరి నరేశ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక ఆషికా రంగనాథ్.