చండీగఢ్: సమాజసేవ అనేది తమ రక్తంలోనే ఉన్నదని బాలీవుడ్ నటుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనూసూద్ చెప్పారు. తన తల్లి ఒక ప్రొఫెసర్ అని, పిల్లలకు తన జీవిత పాఠాలన్నీ నేర్పారని అన్నారు. అదేవిధంగా తన తండ్రి ఒక సామాజిక కార్యకర్త అని, మోగాలో చాలా పాఠశాలలు, కాలేజీలు, ధర్మసత్రాలు తమ భూముల్లోని ఫ్లాట్లోనే నిర్మించబడ్డాయని ఆయన చెప్పారు. అందుకే సామాజిక సేవ అనేది తమ రక్తంలోనే ఉందని చెబుతున్నానని పేర్కొన్నారు.
తన సోదరి కూడా పంజాబ్లోని మోగా సిటీలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని సోనూసూద్ చెప్పారు. మోగాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలావరకు పూర్తికావడానికి తమ సోదరి మాళ్వికనే కారణమన్నారు. మోగాలో నిరక్షరాసత్య, పేదిరికం అనేవి ప్రధాన సమస్యలుగా ఉన్నాయని, ఈ సమస్యల పరిష్కారం కోసం తన సోదరి ఎంతోకాలంగా పోరాడుతున్నారని సూద్ తెలిపారు.
ఇప్పుడు తన సోదరి మాళ్వికా సూద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోగా అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారని, ఆమెను ప్రజలు మంచి మెజారిటీతో గెలిపిస్తారని సోనూసూద్ ధీమా వ్యక్తంచేశారు.