కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు గతం తాలూకు చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా కథానాయికలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కానీ మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ అందుకు భిన్నం. తాజా ఇంటర్వ్యూలో మాజీ ప్రియుడి గురించి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిందీ భామ. తన వ్యక్తిగత ఇష్టాలను, స్వేచ్ఛను ఏ మాత్రం గౌరవించని వ్యక్తి కాబట్టే అతన్నుంచి దూరంగా వచ్చానని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.
‘నేను ప్రతీ విషయంలో నిర్మొహమాటంగా, దూకుడు మనస్తత్వంతో ఉంటాను. అది అతనికి నచ్చలేదు. తన పద్దతులకు అనుగుణంగా ఉండాలని కోరుకునేవాడు. సినిమాల్లో నటించడం కూడా అతనికి ఇష్టం లేదు. అందుకే ఆ బంధం నుంచి బయటపడ్డా. బ్రేకప్ అయిపోయినందుకు ఏమాత్రం బాధపడలేదు. అతని కురచ మనస్తత్వం చూసి జాలి పడ్డాను.
అలాంటి వారితో కలిసి ప్రయాణించడం చాలా కష్టం. అందుకే గుడ్‌బై చెప్పాను’ అని మృణాల్ ఠాకూర్ తెలిపింది. గత కొన్ని నెలలుగా ఈ సొగసరి ప్రేమాయణం గురించి సోషల్‌మీడియాలో బాగా ప్రచారం జరుగుతున్నది. ధనుష్‌తో ఆమె ప్రేమలో ఉందని వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని మృణాల్ ఖండించింది. ఇద్దరం మంచి మిత్రులమని, ఆధారాలు లేని కథనాల్ని ప్రచారం చేయొద్దని కోరింది.