Mrunal Thakur | ‘సీతారామం’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసి యువతరం హృదయాలను దోచుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. తెలుగులో ఎంట్రీకి ముందే కొన్ని హిందీ, మరాఠీ సినిమాల్లో నటించినా.. ‘సీతారామం’ చిత్రమే ఈ అమ్మడి కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది. గత ఏడాది ఆమె నటించిన ‘హాయ్ నాన్న’ హృద్యమైన కుటుంబ కథగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమా విజయానందాన్ని ఆస్వాదిస్తున్న ఈ భామ తెలుగు చిత్రసీమపై ప్రశంసలు కురిపించింది.
బాలీవుడ్లో తనకు రొమాంటిక్ చిత్రాల్లో నటించే అవకాశం రాలేదని, తెలుగులో మాత్రం మనసుకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో భాగమయ్యానని ఆనందం వ్యక్తం చేసింది. తెలుగు ప్రేక్షకులు తనను క్వీన్ ఆఫ్ రొమాన్స్ అని పిలుస్తున్నారని, అందుకు చాలా గర్వపడుతున్నానని మృణాల్ ఠాకూర్ పేర్కొంది. ‘బాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన లవ్ స్టోరీస్ వచ్చాయి. ఆ సినిమాలు చూస్తూ పెరిగాను. దురదృష్టం కొద్ది ఆ జోనర్లో హిందీ సినిమాలు చేయలేదు. ఆ లోటును తెలుగు పరిశ్రమ తీర్చింది’ అని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తున్నది.