Mr. Work From Home Review | తెలుగు చిత్రసీమలో ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. ఇదే బాటలో సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో యువ హీరో త్రిగుణ్ నటించిన ఈ సినిమాపై, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు పాటలు మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ:
అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో లగ్జరీ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి స్వదేశానికి తిరిగి వస్తాడు. ఇక్కడే ఉండి సమాజానికి ఉపయోగపడే ఏదైనా సొంతంగా చేయాలనుకుంటాడు. ప్రస్తుతం రసాయన ఎరువుల వాడకం వల్ల భూములు నిస్సారమవ్వడమే కాకుండా, ఆ పంటలను తినడం వల్ల మనుషుల ఆయుష్షు, ఆరోగ్యం క్షీణిస్తున్న విషయాన్ని అరవింద్ గమనిస్తాడు. దీనికి పరిష్కారంగా ఆర్గానిక్ (సేంద్రీయ) వ్యవసాయం వైపు అడుగులు వేస్తాడు. వ్యవసాయంలో సరికొత్త సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడమే కాకుండా, రైతులు తమ పంటలకు సరైన ఆదాయం పొందేలా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే ప్రత్యేకమైన యాప్‌ను రూపొందిస్తాడు. ఈ ప్రయాణంలో అతను మహి (పాయల్ రాధాకృష్ణ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే, అరవింద్ ఉద్యోగం చేయడం లేదనే కారణంతో మహి అతని ప్రేమను నిరాకరిస్తుంది. మరి ఆ తర్వాత అరవింద్ టెక్నాలజీ సాయంతో రైతుల తలరాతను ఎలా మార్చాడు? మహి మనసు గెలుచుకున్నాడా? చివరకు అతను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ
దర్శకుడు మధుదీప్ చెలికాని కేవలం టైటిల్‌తోనే కాకుండా కథతోనూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనగానే ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించిన కథ అనుకుంటారు. కానీ, హీరో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి, వ్యవసాయాన్ని ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ లాగా ఎలా మార్చాడనే పాయింట్‌ను అద్భుతంగా చూపించారు. మారుతున్న జీవనశైలి కారణంగా నేటి తరం 40 ఏళ్ల లోపే బీపీ, షుగర్, గుండెజబ్బుల బారిన పడుతున్నారు. మన పూర్వీకులు చిరుధాన్యాలు (మిల్లెట్స్), సంప్రదాయ ఆహారం తిని ఎంత ఆరోగ్యంగా ఉండేవారో సినిమాలో చక్కగా గుర్తుచేశారు. తక్కువ పెట్టుబడితో, ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ ఎక్కువ దిగుబడి ఎలా సాధించవచ్చో కథలో చూపించిన విధానం బాగుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా తరహాలోనే, ఈ చిత్రం కూడా రైతుల సమస్యలను, ఆర్గానిక్ ఫార్మింగ్ ఆవశ్యకతను ఆలోచింపజేసేలా తెరకెక్కించారు. భూములు నిస్సారమై ఫ్లాట్లుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితులను ఇందులో చక్కగా ప్రస్తావించారు.
నటీనటుల ప్రతిభ
హీరోగా అరవింద్ పాత్రలో త్రిగుణ్ అద్భుతమైన నటనను కనబరిచాడు. కొన్ని కోణాల్లో అతని లుక్స్ మరియు ఎనర్జీ హీరో రామ్ పోతినేనిని గుర్తుకు తెస్తాయి. ఎమోషనల్ సీన్స్‌లో త్రిగుణ్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్గా పాయల్ స్క్రీన్ లీడ్‌గా అందంగా కనిపించడమే కాకుండా తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, హీరోను ఆర్గానిక్ వ్యవసాయం వైపు నడిపించే పాత్రలో సీనియర్ నటుడు శివాజీ రాజా తమ నటనతో మెప్పించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ (DOP) విజువల్స్ చాలా రిచ్‌గా, పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించాయి. సంగీతం, నేపథ్య సంగీతం (BGM) కథలోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేశాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా బాగున్నాయి.
ముగింపు
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. నేటి తరం యువత మరియు రైతులు తప్పక చూడాల్సిన, ఆలోచింపజేసే ఒక మంచి సందేశాత్మక చిత్రం.
మా రేటింగ్: 3/5