Mokshagna | నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా పరిచయం అవుతారు? ఆయనను లాంచ్ చేయబోయే దర్శకుడు ఎవరు? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు? అనే ప్రశ్నలు చాలా కాలంగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. ఎట్టకేలకు ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావడంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్‌పై కొంత నెగిటివ్ చర్చ కూడా మొదలైంది.
మోక్షజ్ఞ సాధారణ హీరో కాదు.. నందమూరి బాలకృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఆయన డెబ్యూ మూవీపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞను పరిచయం చేయడానికి ఇంకా బలమైన మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ డైరెక్టర్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కొందరు అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బాలయ్యకు ఉన్న మాస్ ఫాలోయింగ్, నందమూరి కుటుంబానికి ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. మోక్షజ్ఞను పవర్ఫుల్ మాస్ కథతో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని కొందరు కోరుకుంటున్నారు. అందుకే వశిష్ఠ ఎంపికపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి.
వశిష్ఠ విషయానికి వస్తే.. ఆయన దర్శకత్వం వహించిన ‘బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్, ఫాంటసీ ఎలిమెంట్స్, కమర్షియల్ టచ్‌తో తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడిగా వశిష్ఠకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘విశ్వంభర’ విషయంలో ప్రేక్షకులు, అభిమానుల్లో మిక్స్డ్ చర్చ జరిగింది. దీంతో మోక్షజ్ఞ వంటి భారీ క్రేజ్ ఉన్న వారసుడి డెబ్యూ సినిమాను వశిష్ఠ చేతుల్లో పెట్టడం సరైన నిర్ణయమేనా? అనే ప్రశ్నలు కొందరు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. అయితే కేవలం గత సినిమాల ఫలితాలను బట్టి దర్శకుడి సామర్థ్యాన్ని నిర్ణయించడం సరైంది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా డెబ్యూ హీరో కోసం దర్శకుడు ఎలాంటి కథను సిద్ధం చేశారనేదే అసలు కీలక అంశంగా మారనుంది.మరోవైపు మోక్షజ్ఞను సాధారణ కమర్షియల్ మాస్ కథతో లాంచ్ చేయకూడదనే ఉద్దేశంతోనే వశిష్ఠను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.