Rich | ఎంజి ఆర్ట్స్ మరియు ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా నిర్మిస్తూ, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న నూతన చిత్రం ‘రిచ్’ పూజా కార్యక్రమాలతో సోమవారం హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది. బేబీ ఆరాధ్య మరియు ఆదర్శ్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షికగా ఖరారు చేశారు. యంగ్ టాలెంటెడ్ హీరో మోహిత్ పెడాడ మరియు శ్రీజిత ఘోష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజా నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకులు గోపీ మోహన్, దశరథ్, వి. సముద్ర, జి. రామ్ ప్రసాద్‌తో పాటు డి.ఎస్. రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రయూనిట్‌కు తమ శుభాకాంక్షలు అందించారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ, దర్శకుడు రాజా నరేంద్ర చెప్పిన కథ ఎంతో అద్భుతంగా అనిపించిందని, ఆ తర్వాత సాయి కార్తీక్, కథానాయకుడు మోహిత్, శ్రీజిత ఘోష్ ఈ ప్రాజెక్టులోకి రావడం పరిపూర్ణతను తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హీరో మోహిత్ పెడాడా మాట్లాడుతూ, ప్రస్తుత తరానికి నచ్చేలా దర్శకుడు ఈ కథను మలిచారని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. సాయి కార్తీక్ అద్భుతమైన పాటలు ఇచ్చారని, సతీష్ రెడ్డి మాసం ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.
దర్శకుడు రాజా నరేంద్ర మాట్లాడుతూ, నేటి తరం ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ ‘బస్తీ బాయ్ లవ్ స్టోరీ’ కథాంశం ఉంటుందని తెలిపారు. సహ నిర్మాత మహేంద్ర గైక్వాడ్ మాట్లాడుతూ, ఈ చిత్రంతో హిందీ సినీ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నామని, ముందుగా తెలుగులో విడుదల చేసి అనంతరం హిందీలో డబ్బింగ్ రూపంలో తీసుకొస్తామని వెల్లడించారు. కథానాయిక శ్రీజిత ఘోష్ మరియు నటి పూజా కేంద్రే ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతోషంగా ఉందంటూ, తమ పాత్రలు ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ స్వరాలు సమకూరుస్తుండగా, సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫర్‌గా, సాయి సతీష్ పి.ఆర్.ఓగా వ్యవహరిస్తున్నారు.