నటీనటులు : సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ తదితరులు
సాంకేతిక విభాగం: సంగీతం – సామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ – కిరణ్ కౌశిక్, సమర్పణ – నారాయణ్ దాస్ కె నారంగ్, నిర్మాతలు – భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, దర్శకత్వం – రంజిత్ జయకొడి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద యాక్షన్ చిత్రాల జోరు సాగుతున్నది. ఈ ట్రెండ్ లో తామూ ఉండాలని హీరోలు కోరుకోవడం సహజమే. ఇలాగే సందీప్ కిషన్ కూడా తనకు అలవాటైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ మార్చి యాక్షన్ కథతో చేసిన సినిమా మైఖేల్. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ తో సినిమా డిఫరెంట్ గా ఉంటుందనే అంచనాలు కలిగించిన ఈ సినిమా థియేటర్ లో ఆ స్థాయిలో మెప్పించిందా లేదా రివ్యూలో చూద్దాం
80, 90 దశకాల్లో జరిగే కథ ఇది. ఇందులో మైఖేల్ (సందీప్ కిషన్) ఒక అనాథ. తల్లి జ్ఞాపకాలతో బతుకుతుంటాడు. ముంబైలో గురునాథ్ (గౌతమ్ మీనన్) పెద్ద డాన్. అందరు గురు అని పిలుస్తుంటారు. కంటి చూపుతో నగరాన్ని శాసిస్తుంటాడు. అయితే భార్య చారులత (అనసూయ) గీసిన గీత దాటడు. వీళ్ల కొడుకు అమర్ నాథ్ (వరుణ్ సందేష్) తండ్రి గురునాథ్ తర్వాత అతని నేర సామ్రాజ్యానికి అధిపతి కావాలనుకుంటాడు. గురునాథ్ మీద జరిగిన హత్యాయత్నాన్ని మైఖేల్ అడ్డుకుని అతని ప్రాణాలు కాపాడుతాడు. దీంతో గురునాథ్ కు దగ్గరవుతాడు మైఖేల్. మైఖేల్ ను పూర్తిగా నమ్మిన గురునాథ్ ..కొడుక్కు ఇవ్వాల్సిన వారసత్వం మైఖేల్ కు ఇస్తాడు. గురునాథ్ మనుషులతో పాటు అతని కొడుకు అమర్ నాథ్ కు ఇది ఏమాత్రం నచ్చదు. మైఖేల్ మీద కక్ష పెంచుకుంటారు. తనపై అటాక్ చేసిన ఆరుగురులో ఒకరిని చంపే బాధ్యత మైఖేల్ కు గురునాథ్ అప్పగిస్తాడు. ఆ పని మీద ఢిల్లీ వెళ్లిన మైఖేల్ తీర (దివ్యాంశ కౌశిక్) ప్రేమలో పడతాడు. ఆమె ఎవరు, గురునాథ్ చెప్పిన పని మైఖేల్ చేశాడా లేదా ఈ కథలో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలేంటి అనేది తెరపై చూాడాలి.
ఒక అనాథ పెద్ద డాన్ కు దగ్గరై ఆప్తుడవడం, ప్రేమ వల్ల ఆ డాన్ కే ఎదురుతిరిగే పరిస్థితులు రావడం..ఈ లైన్ తో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. అనాథ, మదర్ సెంటిమెంట్, నేర సామ్రాజ్యం..ఈ పాయింట్స్ తో కేజీఎఫ్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యాలన్నీ కలిపి దర్శకుడు రంజిత్ జయకొడి చేసిన ప్రయత్నమే మైఖేల్. సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్ నుంచి చివరి వరకు ఈ చిత్రంలో కేజీఎఫ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎడిటింగ్ షాట్స్ కూడా అదే ఫార్మేట్ లో పేర్చారు. అయితే ఆ చిత్రంలో పదునైన సంభాషణలు, అద్భుతమైన నేపథ్య సంగీతం, హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్ ఆకట్టుకోగా…మైఖేల్ లో అవన్నీ కొరవడ్డాయి. సందీప్ కిషన్ తన పాత్ర మేరకు సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సుల్లో అతని కష్టం కనిపించింది. ఆద్యంతం తన నటనలో ఒక మూడ్ మెయింటేన్ చేశాడు. నాయిక దివ్యాంశది కథలో కీలక పాత్ర. అటు గ్లామర్, పర్మార్మెన్స్ లో ఆమె ఆకట్టుకుంది.
డాన్ గా గౌతమ్ మీనన్ రాంగ్ కాస్టింగ్. తమిళ్ కు పనికొస్తుందని తీసుకున్నారేమో గానీ తెలుగులో అతన్ని మన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. పేరున్న నటుడు చేయాల్సిన క్యారెక్టర్ అది. డాన్ కొడుకుగా వరుణ్ సందేశ్ ఓకే గానీ అతని కెరీర్ కు ఈ క్యారెక్టర్ వల్ల లాభమేమీ ఉండకపోవచ్చు. ద్వితీయార్థంలో వచ్చే విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలను అంత బలంగా వాడుకోలేకపోయాడు దర్శకుడు. సినిమాలో రిచ్ మేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, టెక్నికల్ గా ఉన్నత స్థాయి విలువలు కనిపిస్తాయి. 80, 90ల నాటి వాతావరణాన్ని తెరపై రీ క్రియేట్ చేశారు. సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకుంటాయి. యాక్షన్ ఎంటర్ టైనర్స్ ఇష్టపడే ప్రేక్షకులు మైఖేల్ ఒక ఆప్షన్ గా తీసుకోవచ్చు.
చివరగా: “మైఖేల్”…పాత కథకు కొత్త హంగులు
రేటింగ్: 2.5/5