న్యూఢిల్లీ: హాలీవుడ్ నటుడు, నిర్మాత మైఖేల్ డగ్లస్(Michael Douglas)కు అరుదైన గౌరవం దక్కింది. సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. 54వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ దీనిపై ప్రకటన చేశారు. మైఖేల్ డగ్లస్ భార్య క్యాథరీనా జీటా జోన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత సినీ నిర్మాత శైలేంద్రసింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఈ విషయాన్ని పోస్టు చేస్తూ.. డగ్లస్ ఫ్యామిలీకి కేంద్ర మంత్రి స్వాగతం తెలిపారు. భారతీయ వైవిధ్య సంప్రదాయాన్ని డగ్లస్ ఇష్టపడుతారని మంత్రి పేర్కొన్నారు.
1999లో సత్యజిత్ రే జీవిత సాఫల్య అవార్డును ఏర్పాటు చేశారు. సినీ రంగంలో అసాధారణ సేవలు అందించిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. అద్భుతమైన ప్రతిభ ఉన్న మైఖేల్ డగ్లస్ .. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. రెండు సార్లు ఆయనకు ఆస్కార్ అవార్డులు దక్కాయి. అయిదు సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఓసారి ఎమ్మీ అవార్డు దక్కించుకున్నాడు.
వాల్ స్ట్రీట్, బేసిక్ ఇన్స్టింక్ట్, ఫాలింగ్ డౌన్, ద అమెరికన్ ప్రెసిడెంట్, ట్రాఫిక్, బిహాండ్ ద క్యాండలెబ్రా చిత్రాల్లో ఆయన నటించారు. వన్ ఫ్లూ ఓవర్ ద కొకూస్ నెస్ట్, ద చైనా సిండ్రోమ్, ద గేమ్ లాంటి చిత్రాలకు నిర్మాతగా చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డీయర్ గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. డగ్లస్ భార్య క్యాథరీనా జోన్స్ కూడా పలు హిట్ చిత్రాల్లో నటించింది. ట్రాఫిక్, చికాగో, ద మాస్క్ ఆఫ్ జారో చిత్రాల్లో ఆమె నటించారు.
I’m delighted to announce that Michael Douglas, the distinguished Hollywood Actor and Producer, will be honoured with the prestigious Satyajit Ray Excellence in Film Lifetime Award at the 54th International Film Festival Goa.
His deep love for our country, 🇮🇳, is well known,…
— Anurag Thakur (@ianuragthakur) October 13, 2023