రీమేక్లను పక్కనపెట్టి, అసలు సిసలైన అచ్చతెలుగు సినిమాను చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో వాటిని దండిగా ఇచ్చేయాలని ఫిక్స్ అయిపోయారాయన. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘విశ్వంభర’ మెగాస్టార్ కెరీర్లోనే మైలురాయిలా నిలిచిపోయే సినిమా అవుతుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తున్నది. ఇందులో తూర్పుగోదావరిజిల్లాకు చెందిన వ్యక్తిగా చిరంజీవి కనిపించనున్నారు. ఆయన పాత్ర పేరు ‘దొరబాబు’ అని తెలుస్తున్నది. మామూలుగా గోదావరి స్లాంగ్ మాట్లాడటంలో చిరంజీవి మాస్టర్. పైగా ఆయన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఇప్పుడు పాత్ర డిమాండ్ మేరకు గోదావరి మాట్లాడాలి.
ఇక ఆ స్లాంగ్లో చిరంజీవి డైలాగులు చెబుతుంటే అభిమానులకు పండగే. పైగా ఇందులో ఆయన పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందని వినికిడి. ఈ కథలో ఎవరూ ఊహించని పాయింట్ కూడా ఒకటుంటుందట. చిరంజీవి గతంలో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి చిత్రాలకు మించే స్థాయిలో ఈ సోషియోఫాంటసీ ఎలిమెంట్ ఉంటుందని సమాచారం. ‘విశ్వంభర’ తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లే సినిమా అని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తున్నది. చిరంజీవి కెరీర్లోనే అత్యంతభారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల వివరాలు తెలియాల్సివుంది.