సంక్రాంతి విజయం ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో ఈ ఏడాది శుభారంభాన్ని పలికారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయన తదుపరి చిత్రం ‘విశ్వంభర’ కూడా ఈ ఏడాదే విడుదల కానున్నది. ఇదిలావుంటే.. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నది.
బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’తో బ్రదర్ సెంటిమెంట్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న దర్శకుడు బాబీ.. ఈ సారి మెగాస్టార్లో అద్భుతమైన తండ్రిని ఆవిష్కరించనున్నారట. తండ్రీ-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ ఈకథ నడుస్తుందని, అలాగే, కోల్‌కతా నగర నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని విశ్వసనీయ సమాచారం.
పవర్ఫుల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో మెగాస్టార్ కూతురి పాత్రకు ‘జీనియస్’ఫేం అనస్వర రాజన్ని ఎంపిక చేసినట్టు తెలిసింది. గతంలో కోల్‌కతా నేపథ్యంలో కూతురిని అన్వేషించే తండ్రిగా ‘చూడాలని ఉంది’ చేశారు చిరంజీవి. ఈసారి టీనేజ్‌లో ఉన్న అమ్మాయి తండ్రిగా అదే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తారన్నమాట. మెగా అభిమానులకు ఇది నిజంగా ఉత్సాహాన్ని నింపే వార్తే.