Mega 158 Launch | మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న నూతన చిత్రం (Mega158) పూజా కార్యక్రమాలతో నేడు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది.
అయితే ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై పవన్ కళ్యాణ్ మొదటి క్లాప్ కొట్టడం ఈ ఓపెనింగ్ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు ఒకే వేదికపై నవ్వుతూ కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమంలో చిరు కుమార్తె సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.