Supermachi Collections | మెగా ఇంటి నుంచి ఎవరొచ్చినా కూడా ప్రేక్షకులు.. ముఖ్యంగా అభిమానులు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. కాకపోతే వాళ్లు కాస్త కష్టపడాలి. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికి కూడా తన వయసు మర్చిపోయి కష్టపడుతున్నాడు. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఏ హీరో అయినా ఇలాగే కష్టపడతాడు. అందుకే వాళ్లకు అంత ఇమేజ్ ఉంటుంది. అయితే ఈ కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి గుర్తింపు లేకుండా.. కనీసం సినిమా విడుదల అయిన సంగతి కూడా ప్రేక్షకులకు గుర్తు లేకుండా చేసిన హీరో కళ్యాణ్ దేవ్. ఈయన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త.
అల్లుడు కోరిక మేరకు మొదటి సినిమా విజేత బాగానే ప్రమోట్ చేశాడు చిరంజీవి. అది కూడా మామయ్య టైటిల్‌తో వచ్చి హిట్ కొట్టాలి అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. దాంతో విజేత విడుదల తర్వాత కళ్యాణ్ దేవ్ ఖాళీ అయిపోయాడు. మూడేళ్ల గ్యాప్ తీసుకుని సూపర్ మచ్చి అంటూ ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది రెండేళ్ల కింద విడుదల కావాల్సిన సినిమా. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. అయితే కనీసం ఈ సినిమా విడుదలైన సంగతి కూడా ప్రేక్షకులు గుర్తించలేదు. పులి వాసు తెరకెక్కించిన సూపర్ మచ్చి తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషన్ నేపథ్యంలో తెరకెక్కింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమాకు కొన్ని చోట్ల డెఫిషిట్స్ వచ్చాయి. అంటే కలెక్షన్లు రాకపోగా థియేటర్లకు నష్టాలు రావడం అన్నమాట.
రెండు రోజుల్లో ఈ సినిమాకు 10 లక్షల షేర్ కూడా రాలేదని ట్రేడ్ పండితులు అంచనా. ఒక మెగా హీరోకి ఇంతకంటే ఘోర అవమానం మరొకటి ఉండదు. కెరీర్ చక్కబడాలంటే కచ్చితంగా కళ్యాణ్ దేవ్ మరింత కష్టపడక తప్పదు. రాబోయే కాలంలో ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ మరింత కఠినంగా ఉంటే తప్ప ఇండస్ట్రీలో నిలబడటం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.