Mega 158 | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Mega158 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మెగా ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ధమాకా బర్త్‌డే గిఫ్ట్‌గా నిలవనుంది. బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో Mega158పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే తాజా ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ కూడా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇందులో చిరంజీవి పూర్తిగా కొత్త స్టైల్లో, పవర్ఫుల్ స్వాగ్తో కూడిన సిల్హౌట్ లుక్‌లో కనిపించారు. “A New Avatar. A New Attitude. A Whole New Side Of Megastar” అనే క్యాప్షన్‌తో చిరంజీవిని ఇప్పటివరకు చూడని సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నట్లు మేకర్స్ సంకేతాలు ఇచ్చారు.
‘బ్లడీ బెంచ్‌మార్క్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఏ నేపథ్యంలో సాగనుంది? ఇందులో చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలకు ఆగస్టు 22న విడుదల కానున్న టైటిల్ గ్లింప్స్‌తో కొంతవరకు సమాధానం దొరకనుంది. టైటిల్‌తో పాటు మెగాస్టార్ కొత్త అవతార్‌ను చూసేందుకు అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రీకరణలో దాదాపు సగం భాగం పూర్తయినట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన షూటింగ్‌తో పాటు ఎడిటింగ్ పనులను కూడా పూర్తి చేసి లాక్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో మిగిలిన షూటింగ్‌ను కూడా వేగంగా పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మెగాస్టార్‌కు తగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలు, పవర్ఫుల్ యాక్షన్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. Mega158 కోసం టాలీవుడ్‌లోని టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, భాను-నందు సంభాషణలు సమకూరుస్తున్నారు. మొత్తం మీద ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.