Mohan Babu Next Movie | ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీమేక్ సినిమాల సందడి ఎక్కువైంది. చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ఇతర భాషల్లో మంచి విజయాలు సాధించిన చిత్రాలను రీమేక్‌గా చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలకు టాలీవుడ్లో మంచి గిరాకీ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన భీమ్లానాయక్ నుండి ఇటీవలే విడుదలైన ‘గాడ్‌ఫాదర్’ వరకు చాలా సినిమాలు మలయాళం కథలే. కాగా తాజాగా మరో మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా రీమేక్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. సూరజ్, శోభిన్ షాహిర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ సినిమా తెలుగు రీమేక్‌కు సిద్ధమైంది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ రీమేక్‌లో నటించనున్నాడట. ఈ ఏడాది సన్నాఫ్ ఇండియాతో భారీ ఫేయిల్యూర్‌ను సాధించిన మోహన్ బాబు.. ప్రస్తుతం మంచు లక్ష్మీతో అగ్ని నక్షత్రం సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే ఆండ్రాయిడ్ కుంజప్పన్ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయిట. ఈ విషయాన్ని స్వయంగా హీరో, నిర్మాత మంచువిష్ణు తాజాగా వెల్లడించాడు. సైన్స్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తండ్రి, కొడుకులు అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. కాగా తండ్రి పాత్రలో మోహన్‌బాబు నటించనుండగా.. కొడుకు పాత్రలో ఓ టాలీవుడ్ యంగ్ హీరో నటించనున్నాడట. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మించనున్నాడు. కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆహాలో అందుబాటులో ఉంది.