Director Ranjith | ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత రంజిత్ బాలకృష్ణన్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కేరళ చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిపిందే. లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్టయిన నేపథ్యంలో, ‘ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ’ (FEFKA) ఆయన సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ బి. ఉన్నికృష్ణన్ వెల్లడించారు. తమ సంస్థ అంతర్గత విచారణ పూర్తి చేసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సభ్యులపై ఇటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు తాము అనుసరించే సాధారణ నిబంధనల్లో భాగంగానే రంజిత్‌పై ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.
సినిమా షూటింగ్ సమయంలో తనపై రంజిత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువ నటి ఫిర్యాదు చేయడంతో కొచ్చి సిటీ పోలీసులు మంగళవారం రాత్రి రంజిత్‌ను అరెస్ట్ చేశారు. సదరు నటి కొన్ని రోజుల క్రితమే మహిళా పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదును నమోదు చేశారు. దీని ఆధారంగా కేరళ పోలీసులు రంజిత్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపులు మరియు అసభ్యకర చేష్టలకు సంబంధించిన సెక్షన్లు ఇందులో ఉన్నాయి.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం… 2026 జనవరి 30న కొచ్చిలోని ఒక షూటింగ్ లొకేషన్లో కారవాన్ లోపల రంజిత్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అరెస్ట్ అనంతరం పోలీసులు రంజిత్‌ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయనను ఎర్నాకులం సబ్ జైలుకు తరలించారు. ఈ కేసును వేగంగా విచారించేందుకు కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఈ బృందం ఆనాటి ఘటన జరిగిన పరిస్థితులను పరిశీలించడంతో పాటు, ఆ సమయంలో షూటింగ్ స్పాట్లో ఉన్న ఇతర వ్యక్తుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనుంది.