Malavika Nair | ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కళ్యాణ వైభోగమే’, ‘మహానటి’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నాయిక మాళవిక నాయర్. నాగశౌర్య సరసన మాళవిక నటిస్తున్న సినిమా ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’. ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా దర్శకుడు శ్రీనివాస్ అవసరాల రూపొందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. ఈ నెల 17న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన అనుభవాలు తాజా ఇంటర్వ్యూలో తెలిపింది మాళవిక నాయర్.
ఈ చిత్రంతో మీ ప్రయాణం ఎలా సాగింది?
ఇప్పటిదాకా నేను నటించిన చిత్రాల్లో నా పాత్ర వరకు బాగుందా లేదా అని చూసుకునేదాన్ని. కానీ ఈ చిత్రంతో అంతకుమించిన అనుబంధం ఏర్పడింది. మిగతా చిత్రబృందంలో ఒక సభ్యురాలిగా మారిపోయాను. నటిగా నా ప్రతిభ చూపించే చిత్రమిది. భాష, సాహిత్యం మీద పట్టున్న అవసరాల శ్రీనివాస్ వంటి దర్శకుడితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది.
ఈ కథ ఎలా ఉండబోతున్నది?
సాధారణంగా మన ప్రేమ కథల్లో రెండు మూడేండ్లలో జరిగే స్టోరి చూపిస్తారు. కానీ ఇందులో 18 నుంచి 28 ఏండ్ల మధ్య కాలంలో జంట సాగించే ప్రయాణాన్ని ఏడు ఛాప్టర్లలో చూపిస్తారు. ఒక్కో అధ్యాయంలో వైవిధ్యమైన నేపథ్యం ఉంటుంది. వీటిలోని ప్రేమ, ద్వేషం, హాస్యం వంటి అనేక భావోద్వేగాలు ఆకట్టుంటాయి. ఇది ప్రయోగాత్మక సినిమా అనుకోవచ్చు. సందేశాలు ఇవ్వడం లేదు. అయితే ఇందులో మనకు పరిచయం లేని ఎమోషన్స్ ఉండవు. ప్రేక్షకులు వారిని కథతో, పాత్రలతో పోల్చుకుంటారు.
నటిగా మీకు దక్కిన సంతృప్తి గురించి..
నేను ఈ చిత్రంలో అనుపమా అనే పాత్రలో నటించాను. పదేండ్ల ప్రేమ ప్రయాణంలో జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఆలోచనా విధానం, భావోద్వేగాలు మారిపోతుంటాయి. అవన్నీ నా అభినయం ద్వారా చూపించాలి. నటించేందుకు ఆస్కారమున్న పాత్ర ఇది. నటిగా పూర్తి సంతృప్తినిచ్చింది.
నాగశౌర్యతో నటించడం ఎలా ఉంది?
దర్శకుడు చెప్పింది చెప్పినట్లు నటించే హీరో నాగశౌర్య. విద్యార్థిలా ప్రతి విషయాన్ని దర్శకుడి దగ్గర నేర్చుకుంటాడు. సీన్ పూర్తయ్యా కూడా ఎలా వచ్చిందని దర్శకుడి దగ్గర తెలుసుకుంటాడు. ఈ కథలో శౌర్య క్యారెక్టర్ నాకు ఇష్టం. ఆయన బాగా నటించాడు.
నాయికగా ఆశించిన గుర్తింపు దక్కకపోవడంపై మీ స్పందన?
స్టార్డమ్ రాలేదనే ఆలోచన నాలో లేదు. ఆ కోణంలో ఆలోచించలేదు. నేను ఎంపికగా సినిమాలు చేస్తుంటాను. అందుకే ఎక్కువ సంఖ్యలో చిత్రాలు చేయలేకపోయాను. కథ నచ్చితే ఏ తరహా చిత్రాల్లోనైనా నటించేందుకు సిద్ధం. ప్రస్తుతం ‘అన్నీ మంచి శకునములే’, ‘డెవిల్’ చిత్రాల్లో నటిస్తున్నాను.