Diwali 2023 | పండుగ అంటేనే సంబురం! అందులోనూ దివ్వెల పండుగ దీపావళి.. మరింత ప్రత్యేకం! ఇళ్లలో దీపకాంతులు – వీధుల్లో పటాకుల హోరుతో.. ఎక్కడ చూసినా సంతోషాల హేల! సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు కూడా ‘దీపావళి’ని ఎంతో విశేషంగా జరుపుకొంటారు. బాక్సాఫీసును బద్దలుకొట్టే సినీ తారలైనా.. రికార్డులను కొల్లగొట్టే క్రీడాకారులైనా.. దీపావళి వచ్చిందంటే చిన్నపిల్లలై పోతారు. తమ స్టార్ హోదాను పక్కనపెట్టి.. పటాకులు కాలుస్తూ, ఆనందోత్సాహాలతో పండుగ చేసుకుంటారు. ఆ విశేషాలను పాఠకులతోనూ పంచుకుంటారు.
భారతీయ సంప్రదాయాలను పాటించడంలో నేను ఎప్పుడూ ముందుంటాను. అవి భారతీయులను కలిపే ఏకీకృత శక్తిగా పనిచేస్తాయని నా నమ్మకం. అందుకే, అన్ని పండుగలనూ కుటుంబసభ్యులతో కలిసి జరుపుకొంటాను. ముఖ్యంగా.. దీపావళి. ఈ పండుగ నాకెంతో ప్రత్యేకం. అన్నిట్లోనూ సాధారణ అలంకరణను ఇష్టపడే నేను.. దీపావళి డెకరేషన్ కూడా సింపుల్గా చేస్తాను. దీపాల వెలుగులను చూస్తే.. మదిలో ఏదో తెలియని భావన కలుగుతుంది. పండుగలప్పుడే కాదు.. మన సంస్కృతిని నేను నిత్యం ఫాలో అవుతూనే ఉంటాను. ఏదైనా క్యాంపులో చేరడానికైనా, టోర్నమెంట్లో ఆడటానికైనా ఇంటి నుంచి బయల్దేరిన ప్రతిసారీ.. గుడికి వెళ్లమని మా అమ్మ చెబుతూ ఉంటుంది. నేను కూడా తప్పకుండా వెళ్తాను. తాత ముత్తాతలు అందించిన సంప్రదాయాలను ముందు తరాలకు తీసుకెళ్లడాన్ని ఎంతో గర్వంగా భావిస్తాను.
– సవితా పూనియా, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్
మాది ఉమ్మడి కుటుంబం. అన్ని పండుగలనూ కలిసే జరుపుకొంటాం. ఏ వేడుక జరిగినా.. మా బంధువులతో ఇల్లంతా సందడిగా ఉండేది. అమ్మ చేసే సంప్రదాయ వంటలతో మా ఇల్లేకాదు.. వీధి మొత్తం ఘుమఘుమలాడేది. ముఖ్యంగా.. వినాయక చవితి, దీపావళి పండుగలైతే మరింత ఘనంగా చేసుకునేవాళ్లం. నా చిన్నతనం నుంచీ చవితినాడు మా ఇంట్లో గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించేవాళ్లం. సాయంత్రం నిర్వహించే గణేశ్ నిమజ్జన యాత్ర అయితే.. ఎంత సంబురంగా చేసేవాళ్లమో! ఇక దీపావళి రోజున ఇంటి మొత్తాన్నీ దీపాలతో అలంకరించడం, సాయంత్రం పటాకులు కాల్చడం.. సందడంతా మాదే! నా జీవితంలో ఒక్కసారి కూడా ఈ వేడుకను మిస్ కాలేదు.
– షఫాలీ వర్మ, మహిళా క్రికెటర్
పండుగలకే పండుగ.. దీపావళి. కొత్త బట్టలు, లోగిళ్ల నిండా దీపాలు, ముఖ్యంగా పటాకులు.. దీపావళిని ప్రత్యేకంగా నిలుపుతాయి. చిన్నప్పటి నుంచీ దివ్వెల పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేదాన్ని. ఎందుకంటే, పుట్టినరోజు తర్వాత నేను బహుమతులు అందుకునేది ఈ పండుగకే! ప్రతి దీపావళికీ మా అమ్మ ఏదో ఒక నగ నాకు కానుకగా ఇచ్చేది. వాటిని ఎంతో అపురూపంగా దాచుకునేదాన్ని. ఇప్పుడు పెద్దయ్యాను. సంపాదిస్తున్నాను కూడా! అందుకే, అమ్మకు ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నా. షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా.. పండుగనాడు మాత్రం ఇంట్లో ఉండేలా చూసుకుంటా.
– మాళవికా మోహనన్, సినీ నటి
నాకు అత్యంత ఇష్టమైన బాల్య జ్ఞాపకం.. నిస్సందేహంగా దీపావళి పండుగే! పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేవడం.. కొత్త బట్టలు కట్టుకొని పూజలు చేయడం ఎంతో గొప్పగా ఉండేది. ఉదయం ఆరు గంటల నుంచే పటాకులు కాల్చడం మొదలుపెట్టేవాళ్లం. పెద్దపెద్ద శబ్దాలు చేసేవి కాకుండా భూచక్రాలు, చిచ్చుబుడ్లు లాంటి కాంతులు విరజిమ్మే వాటినే ఎక్కువగా ఇష్టపడేవాళ్లం. టిఫిన్ చేయడానికి కొంత విరామం ఇచ్చి.. మళ్లీ పటాకులపై పడేవాళ్లం. అలా రాత్రి పొద్దుపోయే దాకా.. కాలుస్తూనే ఉండేవాళ్లం. ఇప్పుడు మాత్రం అలా కాల్చడం లేదు. పండుగను ఎకో ఫ్రెండ్లీగానే చేసుకుంటున్నా. ఇప్పటికీ నేను ముంబైలో ఉన్నా, బెంగళూరులో అమ్మాన్నాన్నల దగ్గరికి వెళ్లినా.. దీపావళికి ఇల్లంతా దీపాలతో అలంకరిస్తా. మొత్తంగా దీపావళి అంటే.. కాంతిని పంచే పండుగ. బంధువులు-స్నేహితులతో సంతోషంగా గడిపే వేడుక.
– ప్రియమణి, సినీ నటి