ఒక్కో చిత్రానికి స్థాయి పెంచుకుంటూ ఇప్పుడు స్టార్ హీరో విక్రమ్ సరసన నటించే అవకాశం అందుకుంది కోలీవుడ్ సుందరి మాళవిక మోహనన్. గతంలో ఆమెకు రజనీకాంత్‌తో ‘పెట్టా’, ధనుష్ సరసన ‘మారన్’, విజయ్‌తో ‘మాస్టర్’ చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. ఆ చిత్రాల్లో మాళవికకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. దీంతో స్టార్ హీరోలతో నటించినా ఆమెకు సోలో నాయికగా గుర్తింపు రాలేదు. కానీ విక్రమ్ హీరోగా ‘తంగలాన్’ పేరుతో దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నదీ తార.
ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే నిశ్చయంతో ఉందీ ఈ చిత్రంలో ఆమె కొన్ని పోరాట సన్నివేశాల్లోనూ పాల్గొంటున్నది. ఇందుకోసం పురాతన యుద్ధ విద్య సిలంబమ్ ను నేర్చుకుంటున్నది. ఇది మన కర్రసాము లాంటి పోరాట విద్య. మాళవిక స్పందిస్తూ…‘సిలంబమ్ విద్యను నేర్చుకోవడంలో వినోదాన్ని పొందుతున్నా. దీన్ని నా జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటున్నా’ అని పేర్కొంది. తంగలాన్ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది.