Madhavan | సినిమా ప్రపంచంలో ఓ వెలుగు వెలిగే స్టార్ల జీవితాలు బయటకు ఎంతో హుందాగా కనిపించినా, వారి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో ఒత్తిడులు ఉంటాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు కొందరిని కుంగదీస్తే, మరికొందరిని కొత్త దారులు వెతుక్కోవడానికి ప్రేరేపిస్తాయి. అలాంటి అనుభవాన్నే ప్రముఖ నటుడు మాధనవ్ తాజాగా బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాధవన్ తన జీవితంలో కరోనా కాలం ఎంత పెద్ద మలుపు తీసుకువచ్చిందో వివరించారు. పని లేక ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చిన సమయంలో, తన భార్య సరిత చెప్పిన మాటలు తనను లోలోపల కుదిపేశాయని తెలిపారు. “నువ్వు ఖాళీగా ఉండడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. పని ఉన్నప్పుడే నీలో ఉత్సాహం కనిపిస్తుంది” అని ఆమె చెప్పిన మాటలు మొదట బాధపెట్టినా, తర్వాత ఆలోచింపజేశాయని ఆయన చెప్పారు.
ఆ మాటల ప్రభావంతో నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి దేశమంతా తిరిగినట్టు మాధవన్ వెల్లడించారు. ఈ ప్రయాణంలో అనేక మందిని కలుసుకుని, వారి జీవితాలను తెలుసుకుంటూ ఎన్నో అనుభవాలు సొంతం చేసుకున్నానని తెలిపారు. ఈ అనుభవాలు తనలో కొత్త ఆలోచనలను కలిగించాయని, జీవితాన్ని మరో కోణంలో చూడడం నేర్పించాయని ఆయన చెప్పారు. ఇక తన కెరీర్ గురించి చెప్పుకుంటూ, చిన్న చిన్న టీవీ పాత్రలతో మొదలైన తన ప్రయాణం ఎలా సినిమాల వరకు వచ్చిందో వివరించారు. ‘మిన్నలే’ సినిమాతో వచ్చిన గుర్తింపు, అదే కథతో తెలుగులో వచ్చిన ‘సఖి’ ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. తర్వాత అనేక భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నట్లు తెలిపారు.
ఈ అనుభవాల తర్వాత తన సినిమాల ఎంపికలో కూడా మార్పు వచ్చిందని, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నానని మాధవన్ అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధవన్ మాటలపై స్పందిస్తున్న నెటిజన్లు, “మీ జీవితంలో మీ భార్య కీలక పాత్ర పోషించింది”, “ఆమె ప్రోత్సాహమే మీ విజయానికి కారణం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, ఒక చిన్న మాట జీవితాన్ని ఎంత పెద్దగా మార్చగలదో మాధవన్ కథ మరోసారి రుజువు చేసింది.