‘తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఇండస్ట్రీకి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరిస్తూ సినీరంగాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది’ అని అన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ) నూతన కార్యవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది. చైర్మన్‌గా ప్రతాని రామకృష్ణగౌడ్, వైస్చైర్మన్లుగా గురురాజ్, నెహ్రూ, సెక్రటరీగా జేవీఆర్ బాధ్యతల్ని స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ‘సినిమా నటులకు తెలంగాణ, ఆంధ్ర అనే భేదాలు లేవు. తెలుగు వాళ్లం అనే భావన అందరిలో ఉంది. కలిసికట్టుగా సినీ పరిశ్రమ ఉన్నతికి పాటుపడాలి’ అని తెలిపారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘తెలుగు సినిమాలోని ఇరవై నాలుగు విభాగాల వారికి సంబంధించిన అసోసియేషన్ ఇది. ఏడుగురు సభ్యులతో ప్రారంభమైన ఈ అసోసియేషన్ నేడు పదివేల మందికి చేరుకోవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో సినీ కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం’ అని చెప్పారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ‘మా’ ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు పాల్గొన్నారు.