MAA | తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని నటీనటుల సంక్షేమం కోసం పని చేసే ఏకైక అధికారిక సంస్థ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాత్రమేనని, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇదొక్కటే గుర్తింపు పొందిన సంఘమని అసోసియేషన్ ఒక అధికారిక ప్రకటనలో తాజాగా వెల్లడించింది. ఇటీవల కొంతమంది వ్యక్తులు, అనధికారిక బృందాలు ఏపీ మా (AP MAA), మా ఏపీ (MAA AP) వంటి తప్పుదోవ పట్టించే పేర్లతో నటీనటులను, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మా కార్యవర్గం వెల్లడించింది. ముఖ్యంగా ఇలాంటి నకిలీ సంఘాల పేరుతో కళాకారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం అందడంతో ‘మా’ తీవ్రంగా స్పందించింది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గుర్తింపు ఉన్న ఏకైక అసోసియేషన్ తమదేనని, పరిశ్రమలోని 24 విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సభ్యుల ప్రయోజనాల కోసం తాము మాత్రమే పని చేస్తున్నామని స్పష్టం చేసింది. ‘మా’ పేరును వాడుకుంటూ మోసాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నటీనటులు ఎవరూ ఇలాంటి అనధికారిక సంస్థలకు సభ్యత్వ రుసుములు కానీ, విరాళాలు కానీ చెల్లించవద్దని, ఏదైనా అనుమానం ఉంటే హైదరాబాద్ ఫిలింనగర్లోని ‘మా’ కార్యాలయంలో సంప్రదించాలని కోరింది. తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని, సమగ్రతను కాపాడేందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.