‘నా కాలేజీ జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నా. యూనివర్సల్ కథాంశం కాబట్టి అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనుకున్నా’ అని చెప్పారు ప్రదీప్ రంగనాథన్. స్వీయ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘లవ్‌టుడే’ అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు. శనివారం చిత్ర నాయకానాయికలు ప్రదీప్, ఇవానా పాత్రికేయులతో ముచ్చటించారు. ప్రదీప్ మాట్లాడుతూ ‘2017లో ‘ఆప్లాక్’ పేరుతో తీసిన షార్ట్‌ఫిల్మ్ కథను మరింతగా విస్తరించి ‘లవ్‌టుడే’ స్క్రిప్ట్ తయారు చేశా. మన ఫోన్‌ను ఎవరికైనా ఇవ్వాలంటే ఇబ్బందిపడతాం. అందులో చెడు ఏమీ లేకపోయినా మన వ్యక్తిగత విషయాలు తెలిసిపోతాయనే భయం ఉంటుంది.
అలాంటిది ఓ అబ్బాయి అమ్మాయి ఫోన్లు మార్చుకుంటే ఎలా ఉంటుందనే ఐడియా నుంచే ఈ కథ పుట్టింది. భవిష్యత్తులో దర్శకత్వంతో పాటు నటన కూడా కొనసాగిస్తా. ఏ కథ రాసినా యూనివర్సల్ కాన్సెప్ట్‌తో అందరికి చేరువకావాలన్నదే నా లక్ష్యం. నేను ఎవరి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేయలేదు. యూట్యూబ్ ద్వారా ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుసుకున్నా. షార్ట్‌ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టా’ అని చెప్పారు. తమిళంలో ‘లవ్‌టుడే’ చిత్రం తన కెరీర్‌కు బ్రేక్‌నిచ్చిందని కథానాయిక ఇవానా ఆనందం వ్యక్తం చేసింది.