Michael Trailer | ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ (Michael) ఫైనల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, ట్రైలర్లో ఆయన బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ మూమెంట్స్ మరియు లుక్ అచ్చం మైఖేల్ జాక్సన్‌ను తలపిస్తుండటం విశేషం. దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ ట్రైలర్లో ‘బీట్ ఇట్’, ‘థ్రిల్లర్’, ‘బిల్లీ జీన్’ వంటి ఐకానిక్ సాంగ్స్ ప్రదర్శనలతో పాటు, మైఖేల్ వ్యక్తిగత జీవితంలోని భావోద్వేగ అంశాలను, బాల్యంలో ఆయన ఎదుర్కొన్న సంఘర్షణలను మరియు వివాదాలను ఎంతో ఆకట్టుకునేలా చూపించారు.
ఆస్కార్ విజేత గ్రాహమ్ కింగ్ నిర్మించిన ఈ చిత్రంలో కోల్మన్ డొమింగో, నియా లాంగ్, మైల్స్ టెల్లర్ వంటి హాలీవుడ్ ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కేవలం ఒక సంగీత ప్రయాణంలా కాకుండా, ఒక లెజెండరీ స్టార్ జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరించే ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.