Lenin | టాలీవుడ్లో భారీ చిత్రాల విడుదల తేదీలు వరుసగా మారుతూ ఉండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే మరో సినిమాపై ప్రభావం చూపుతూ ఇది చైన్ రియాక్షన్‌లా మారుతోంది. రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలని భావించిన చిత్రబృందం, షూటింగ్ ఆలస్యం కారణంగా ఏప్రిల్ 30కి మార్చింది. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా సాధ్యం కాదనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ‘పెద్ది’ విడుదల తేదీపై స్పష్టత లేకపోవడం ఇతర సినిమాలపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం ఎక్కువగా ప్రభావితమైంది.
మొదట ‘పెద్ది’ ఏప్రిల్ 30న విడుదల అవుతుందనే కారణంతో ‘లెనిన్’ను వాయిదా వేశారు. అయితే పెద్ది మళ్లీ వాయిదా పడ్డా కూడా లెనిన్ ఆ డేట్‌కి వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు అఖిల్ బర్త్ డే సందర్భంగా మూవీ నుండి పోస్టర్ విడుదల చేస్తూ జూన్ 26న లెనిన్ రిలీజ్ కానుందంటూ ప్రకటించారు. దీంతో అక్కినేని అభిమానులు ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ రోజు లెనిన్ నుండి ఏదైన టీజర్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూడగా, వారికి నిరాశే ఎదురైంది.
లెనిన్ మూవీకి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేం మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, సాంగ్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. శివాజీ కీలకపాత్రలో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ తర్వాత వచ్చిన హలోతో అంతగా అలరించలేకపోయాడు. ఇక ఆ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, మిస్టర్ మజ్ను, లాస్ట్‌గా ఏజెంట్ మూవీలో నటించారు. ఇప్పటివరకూ సరైన హిట్ పడలేదు.