LaggamTime | టాలీవుడ్ యువ నటీనటులు రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లగ్గం టైం’. కె. యశ్వంత్ కుమార్ సమర్పణలో, 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. హిమబిందు నిర్మాణంలో ప్రజోత్ కె వెన్నం ఈ చిత్రాన్ని రూపొందించారు. పెళ్లి నేపథ్యానికి క్రైమ్ కామెడీని జోడించి తీసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
అనన్య (నవ్య చిట్యాల), చంద్ర (సుదర్శన్)ల వివాహ వేడుకతో ఈ సినిమా కథ మొదలవుతుంది. అనన్య మాజీ ప్రియుడు సూర్య (రాజేష్ మేరు) తన స్నేహితుడితో కలిసి, ఆమెను పెళ్లి పీటల మీద నుంచే తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అయితే పెళ్లి ఇంట్లో జరిగిన ఒక అనుకోని సంఘటనతో భయపడి వారు అక్కడి నుండి పారిపోతారు. అయితే అదే రోజు సూర్యకు ఒక ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూ ఉండటంతో నేరుగా అక్కడికి వెళ్తాడు. మరోవైపు పెళ్లి ఇంట్లో పెళ్లికొడుకు చంద్ర అకస్మాత్తుగా కిడ్నాప్ అవుతాడు. ఇంటర్వ్యూలో సూర్య తన హెచ్ఆర్ (ప్రీతీ సుందర్)కు పూణేలో తనకూ, అనన్యకూ మధ్య సాగిన ప్రేమకథను వివరిస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని, పెళ్లికొడుకును కిడ్నాప్ చేసింది సూర్యనే అని అతడిని అరెస్ట్ చేస్తారు. అసలు చంద్రను కిడ్నాప్ చేసింది ఎవరు? పూణే ప్రేమకథకు, ఈ కిడ్నాప్‌కు ఉన్న సంబంధం ఏంటి? చివరకు సూర్య, అనన్యలు ఎలా కలిశారు? అన్నదే ఈ చిత్ర కథాంశం.
విశ్లేషణ:
పెళ్లి సమయంలో పెళ్లి కొడుకో, పెళ్లి కూతురో మిస్ అవ్వడం అనే పాయింట్ మీద ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. అయితే దర్శకుడు ప్రజోత్ ఆ రొటీన్ పాయింట్‌కే కాస్త భిన్నమైన కథనాన్ని జోడించారు. ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీని నడుపుతూనే, సెకండ్ హాఫ్‌పై ఆసక్తి కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, పెళ్లికొడుకు ట్రాక్ సినిమాకు బలాన్ని ఇచ్చాయి. కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమా ప్రారంభంలో సుమారు 20 నిమిషాల పాటు పెళ్లి సందడిని సాగదీసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ స్నేహితురాలి హిందీ-తెలుగు కామెడీ కొన్ని చోట్ల విసుగు తెప్పిస్తుంది. అలాగే లవ్ ఫెయిల్యూర్ సీన్స్ పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నప్పటికీ, దాన్ని ఇంకాస్త బలంగా ముగించి ఉండాల్సింది.
నటీనటులు
హీరోగా రాజేష్ మేరు సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోగా, తెలుగమ్మాయి నవ్య చిట్యాల తన క్యూట్ లుక్స్‌తో, నటనతో మెప్పించింది. కమెడియన్ సుదర్శన్ తనదైన టైమింగ్‌తో సినిమాను భుజాన వేసుకున్నారు. ఇతర నటీనటులు ప్రణీత్ రెడ్డి, అరుణ్ కుమార్, ప్రీతీ సుందర్, కేదార్ శంకర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది, కానీ పాటలు మాత్రం సగటున ఉన్నాయి. ఎడిటర్ అనవసరమైన కామెడీ సీన్లను మరికొంత ట్రిమ్ చేసి ఉంటే సినిమా వేగం పెరిగేది.
చివరిగా: సరదాగా కాసేపు నవ్వుకోవడానికి, చిన్న చిన్న ట్విస్టులతో సాగే క్రైమ్ కామెడీని ఇష్టపడేవారు ‘లగ్గం టైం’ పై ఒక లుక్ వేయొచ్చు.
రేటింగ్: 2.75/5