Krishnavataram Trailer | మధురలోని అత్యంత పవిత్రమైన శ్రీ కృష్ణ జన్మభూమి వేదికగా ‘కృష్ణావతారం’ చిత్ర ట్రైలర్ గ్రాండ్‌గా విడుదలైంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ వేడుకతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దర్శకుడు హార్దిక్ గజ్జర్ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రలో సిద్ధార్థ్ గుప్తా నటిస్తుండగా, రాధగా సుష్మిత భట్, సత్యభామగా సంస్కృతి జయాన, రుక్మిణిగా నివాషిని కృష్ణన్ కనిపించబోతున్నారు.
క్రియేటివ్‌ల్యాండ్ స్టూడియోస్ ఎంటర్టైన్మెంట్ మరియు అథశ్రీకథ మోషన్ పిక్చర్స్ పతాకాలపై సజన్ రాజ్ కురుప్, శోభా సంత్, పూనమ్ ష్రాఫ్, పార్థ్ గజ్జర్ ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రకాష్ కపాడియా, రామ్ మోరి, హార్దిక్ గజ్జర్ స్క్రీన్‌ప్లే అందించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయనక బోస్ అద్భుతమైన విజువల్స్ అందించారు. మొత్తం మూడు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి అధ్యాయం మే 7, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.