అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘కొత్త కొత్తగా’. ఈ చిత్రాన్ని బీజీ గోవిందరాజు సమర్పణలో ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు. హనుమాన్ వాసంశెట్టి దర్శకుడు. ఈ నెల 9న విడుదలకానుంది. తాజాగా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ…‘బలమైన కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తి కలిగించేలా సినిమా ఉంటుంది. అబ్బాయిలకు ఆమడ దూరం ఉండే ఒక అమ్మాయిని, ప్రాణంగా ప్రేమించే కుర్రాడి కథ ఇది. భిన్న ధృవాల్లాంటి మనస్తత్వం ఉన్న ఈ జంట ఎలా కలిశారు అనేది తెరపై చూడాలి’ అన్నారు. సమర్పకులు గోవిందరాజు మాట్లాడుతూ..‘కంటెంట్ మీద నమ్మకంతో పెద్ద చిత్రాల మధ్య మా సినిమాను విడుదల చేస్తున్నాం’ అన్నారు.