యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’. రమేష్ కాదూరి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘చమక్ చమక్ పోరి..’ పాటను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. బాలాజీ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందించగా అరణ్ కౌండిన్య, ఎంఎల్ గాయత్రి పాడారు. పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత చెర్రీ మాట్లాడుతూ…‘టీజర్ చూశారు, పాట చూశారు..‘మీటర్’లో మ్యాటర్ ఉందని మీకు అర్థమై ఉంటుంది. అందమైన సెట్లో ఈ పాట పిక్చరైజ్ చేశాం. భాను కొరియోగ్రఫీ చేశారు. కిరణ్ చేసిన మాస్ స్టెప్పులు ఆకట్టుకుంటాయి. సినిమాలో ఈ పాట ఆకర్షణ అవుతుంది.’అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…‘ఈ పాట ప్రదర్శిస్తున్నప్పుడు మీ ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ సాంగ్‌లోని ఎనర్జీ ఆకట్టుకుంటుంది. నా కెరీర్లో ఓ భారీ సెట్లో చేసిన పాట ఇది. సినిమా ఆద్యంతం వినోదాన్ని అందిస్తుంది’ అని అన్నారు.