హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న యువతరం ప్రేమకథ ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకుడు. ‘బేబీ’ దర్శకుడు సాయిరాజేశ్ కథ అందించి, ఎస్కేఎన్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను హైదరాబాద్‌లో మేకర్స్ విడుదల చేశారు.
‘వదలనే.. నిను వదలనే.. నిను వదలనే.. నిను వదిలి నేనెటూ కదలనే..’ అంటూ సాగే అనంతశ్రీరామ్ రాసిన ఈ పాటను అగ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఆయనతోపాటు సంగీత దర్శకులు మాధవపెద్ది సురేశ్, కల్యాణి మాలిక్, అనూప్ రూబెన్స్, హరి గౌర, మార్క్ కె.రాబిన్, సింజిత్ యెర్రమల్లి, చేతన్ భరద్వాజ్, స్వీకర్ అగస్తీ, సురేష్ బొబ్బిలి, వివేక్‌సాగర్, శ్రీచరణ్ పాకాల ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి విషెస్ చెప్పారు. ‘మణిశర్మ ఈ సినిమాకు అద్భుతమైన ఏడు మెలొడీ సాంగ్స్ ఇచ్చారు.
హార్ట్ బ్రేకింగ్ సిట్యువేషన్లో ఈ పాట వస్తుంది. డైరెక్టర్ రవి నంబూరి డిఫరెంట్ అప్రోచ్‌తో పాటను చిత్రీకరించారు. కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించారు. గౌరిప్రియ అయితే ప్రాణం పెట్టింది’ అని నిర్మాత సాయిరాజేశ్ తెలిపారు. ఈ పాట సిట్యువేషన్‌ని దర్శకుడు చెబుతుంటే కళ్లు చమర్చాయని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ఇంకా శ్రీగౌరీ ప్రియ, సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా మాట్లాడారు.