KGF 3 | కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన ‘కేజీయఫ్’ ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, హీరో యష్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘కేజీయఫ్ చాప్టర్ 1’, ‘కేజీయఫ్ చాప్టర్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఈ రెండు భాగాల విజయంతో మూడో భాగం ‘కేజీయఫ్ 3’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీయఫ్ 2’ చివర్లో కథను పూర్తిగా ముగించకుండా వదిలేయడం వల్ల మూడో భాగం తప్పకుండా వస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఏర్పడింది. ఇదే విషయంపై తాజాగా హీరో యష్ స్పందిస్తూ… ‘కేజీయఫ్ 3’ ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అన్న విషయంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.
యష్ తెలిపిన ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా సమయం పడే అవకాశముంది. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తరచూ ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని, సరైన సమయం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ‘కేజీయఫ్ 3’ ఆలస్యమవుతోందని సమాచారం. ప్రస్తుతం యష్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘టాక్సిక్’, ‘రామాయణ పార్ట్ 1’, ‘రామాయణ పార్ట్ 2’ వంటి ప్రాజెక్టులు సెట్స్‌పై ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా ‘సలార్ 2’ కూడా ఆయన ప్లాన్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఇద్దరి షెడ్యూల్స్ కలిస్తేనే ‘కేజీయఫ్ 3’ ముందుకు సాగే అవకాశం ఉంది.
‘కేజీయఫ్ 1’ 2018లో విడుదల కాగా, నాలుగేళ్ల తర్వాత 2022లో ‘కేజీయఫ్ 2’ వచ్చింది. ఇప్పటికే రెండో భాగం విడుదలై కూడా నాలుగేళ్లు పూర్తవుతుండటంతో, మూడో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే ‘కేజీయఫ్ 3’ కోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘కేజీయఫ్ 3’ వస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చినప్పటికీ… అది ఎప్పుడు తెరకెక్కుతుంది అన్నది ఇంకా అనిశ్చితంగానే ఉంది. దీంతో అభిమానులు ఒకవైపు సంతోషంగా ఉండగా… మరోవైపు ఎదురు చూపులు మాత్రం కొనసాగుతున్నాయి.