Kavya | కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత కావ్య మారన్ల వివాహంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటవుతారనే ప్రచారం సినీ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పుకార్లపై తాజాగా ప్రముఖ తమిళ నటుడు, నాటకరంగ దిగ్గజం వై.జి. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీశాయి. ఒక తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న వై.జి. మహేంద్రన్, అనిరుధ్ వ్యక్తిత్వం, కావ్య మారన్ వ్యాపార నైపుణ్యాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అనిరుధ్ ఎంతో మృదుస్వభావి, ప్రతిభావంతుడైన యువకుడని ఆయన కొనియాడారు.
అనిరుధ్ చాలా మంచి వ్యక్తి. అతను ఎంతో సాఫ్ట్ నేచర్ కలిగినవాడు. అయితే ఏదో ఒక కారణం అతన్ని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోందనిపిస్తోంది. కానీ త్వరలోనే ఆ అడ్డంకులు తొలగిపోతాయని నేను ఆశిస్తున్నాను అని వై.జి. మహేంద్రన్ వ్యాఖ్యానించారు. అనిరుధ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని, ఈ విషయంలో తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. తాను కూడా విన్న సమాచారాన్ని బట్టే మాట్లాడుతున్నప్పటికీ, ఈ వివాహం జరుగుతుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి చాలా అందమైన జంటగా కనిపిస్తారని, మంచి దంపతులుగా పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు.
ఇక కావ్య మారన్ గురించి మాట్లాడిన వై.జి. మహేంద్రన్, ఆమెను కేవలం ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా మాత్రమే కాకుండా, సమర్థవంతమైన వ్యాపారవేత్తగా అభివర్ణించారు. తన తండ్రి కళానిధి మారన్ వ్యాపార దక్షతను పూర్తిగా అలవర్చుకున్నందువల్లే కావ్య మారన్ ఇంత పెద్ద స్పోర్ట్స్ ఫ్రాంచైజీని విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. గతంలో సన్ టీవీ ఓటీటీ విభాగంలో కావ్య మారన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదన కోసం ఆమెను కలిసినప్పుడు ఎంతో మర్యాదగా మాట్లాడారని, కథలు నచ్చడంతో ఒకేసారి ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారని వెల్లడించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు ముందుకు సాగకపోయినా, వ్యక్తిగా కావ్య మారన్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు.
అనిరుధ్ సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండగా, కావ్యా మారన్ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారని పేర్కొంటూ, “ఇకపై వీరిద్దరూ కలిసి మ్యూజికల్ బిజినెస్ చేస్తారేమో” అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.వై.జి. మహేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యలతో అనిరుధ్-కావ్యా మారన్ వివాహ వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ సంబంధంపై ఇప్పటివరకు అనిరుధ్ లేదా కావ్యా మారన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక వై.జి. మహేంద్రన్ విషయానికి వస్తే, ఆయన తమిళ నాటకరంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎన్నో విజయాలను అందుకున్న ఆయన, అనేక తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర నటులతో కలిసి పనిచేసిన ఆయనకు దశాబ్దాల సినీ అనుభవం ఉంది.