Kara | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కర’ (Kara) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే వార్త చెప్పింది. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మే 28 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుందనే వార్తలు వినిపించగా.. తాజాగా ఈ మూవీ భాషల విషయంలో కూడా అధికారిక స్పష్టత వచ్చింది. కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను దృష్టిలో పెట్టుకుని నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది.
తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమాను మే 28 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేయడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. దర్శకుడు విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో ధనుష్ ‘కరస్వామి’ అనే లోకల్ దొంగ పాత్రలో కనిపించనున్నారు. తన కెరీర్లో మరో డిఫరెంట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. ధనుష్ నటన, యాక్షన్ సన్నివేశాలు మంచి ప్రశంసలు అందుకున్నాయి.
ప్రత్యేకంగా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో కూడా పలువురు ఫ్యాన్స్ “ధనుష్ వన్ మ్యాన్ షో” అంటూ కామెంట్లు చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మమితా బైజు నటించగా.. జయరామ్, కరుణాస్ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రముఖ నిర్మాత డాక్టర్ ఇషారి కె. గణేష్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన తెలుగు ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమకు నచ్చిన భాషలో ఈ యాక్షన్ డ్రామాను వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ ఓటీటీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.