Elnaaz Norouzi | ఎల్నాజ్ నొరౌజీ.. 14 ఏండ్లకే మాడలింగ్లో తళుక్కున మెరిసింది. ఇరాన్లో పుట్టి, జర్మనీలో పెరిగిన ఈ సుందరి.. అనేక అంతర్జాతీయ బ్రాండ్స్‌కు మాడలింగ్ చేసింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించి.. తన మ్యాజిక్ చూపించింది. సినిమాలు – వెబ్ సిరీస్‌లతో బీ టౌన్‌కు దగ్గరైంది. కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘డెవిల్’లో.. బార్ డ్యాన్సర్ ‘రోజీ’గా అలరించబోతున్నది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే.. యువకుల గుండెలను కొల్లగొట్టిన ఈ ఇరాన్ సోయగం అంతరంగం..
నాకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఆశ. అది కూడా ఐదు రోజుల పెళ్లి. భారత్ – కాలిఫోర్నియా – జర్మనీ – ఇరాన్ సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. భారత్‌లో సంప్రదాయ లెహంగాలో.. ఇరాన్లో తెల్ల గౌన్‌లో పెళ్లి కూతురిలా మెరిసిపోవాలని ఇప్పటినుంచే కలలు కంటున్నా!
నేను మాడలింగ్ ప్రారంభించిన రోజులతో పోలిస్తే.. ఈ రంగంలో ఎంతో మార్పు వచ్చింది. అప్పట్లో ఇంటర్నెట్ వాడకం ఇంతగా లేదు. మేం ఫొటోలు దిగి, ప్రింట్ చేయించి.. మాడలింగ్ సంస్థలకు పంపడమో.. స్వయంగా వెళ్లి ఫొటోలు చూపించడమో చేసేవాళ్లం. సామాజిక మాధ్యమాల విప్లవంతో అంతా మారిపోయింది. అరచేతిలోని స్మార్ట్ఫోనే.. అన్నీ చేసేస్తున్నది. ఇప్పుడు ఫొటోలు దిగి.. అప్పటికప్పుడు కావాల్సిన వాళ్లకు పంపించడమే! ఇంతలో ఎంతో మార్పు.
భారత్‌లో బంధాలు విలువలతో ముడిపడి ఉంటాయి. ఎన్నో దేశాలు తిరిగాను. ఇంత బలమైన మానవ సంబంధాలను ఎక్కడా చూడలేదు. ఇక్కడి ప్రజలు పనికి, స్నేహానికి విలువనిస్తారు. బంధాలను బలంగా ఉంచుకుంటారు.
నేను కథక్ నేర్చుకున్నా. హిప్హాప్, పర్షియా సంప్రదాయ నృత్యంలోనూ ప్రావీణ్యం సాధించా. ఫిట్నెస్ కాపాడుకునేందుకు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, జిమ్‌ను ఆశ్రయిస్తా! మానసిక బలం కోసం రోజూ పడుకునేముందు యోగా చేస్తా! దీనివల్ల ఆ రోజంతా ఉన్న ఒత్తిడి దూరం అవుతుంది. చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది.
నాకు ఏడు భాషలు వచ్చు. మాతృభాష పార్శీ. జర్మనీలో పెరిగాను కాబట్టి.. జర్మన్ వచ్చు. స్కూల్లో ఉండగానే.. ఇంగ్లిష్, ఫ్రెంచ్ వచ్చేసింది. భారత్‌కు వచ్చాక.. హిందీ, ఉర్దూ నేర్చుకున్నా. పంజాబీ చిత్రంలో నటించినప్పుడు.. ఆ భాషపైనా పట్టుసాధించా. ఇక్కడితోనే ఆపేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే.. నా లక్కీ నెంబర్ ఏడు. అంతేకాదు.. అన్ని భాషలూ నా బుర్రలో ఉంటే, కొంచెం కన్ఫ్యూజ్ అవుతా కూడా!
హైదరాబాద్.. భారత్‌లో నాకు బాగా నచ్చిన నగరం. ఇక్కడి సంస్కృతి చాలా ఇష్టం. మతాలకు అతీతంగా కలిసి ఉండే ప్రజలంటే.. ప్రత్యేక అభిమానం. ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ.. నా ఆల్‌టైమ్ ఫేవరేట్! పూర్వజన్మలో ఇదే నా సొంతూరు అని అనుమానం.
నేను పుట్టింది ఇరాన్లో. చిన్నప్పుడే మా కుటుంబం జర్మనీకి వచ్చేసింది. నా చదువంతా అక్కడే సాగింది. 14 ఏళ్లకే మాడలింగ్లో అవకాశాలు వచ్చాయి. అయితే, నాకు మాత్రం యాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో.. సినిమాల్లో అవకాశాలకు మాడలింగ్ను వారధిలా చేసుకున్నా.
హైదరాబాద్ రావడానికి ముందే.. తెలుగు పరిశ్రమ గురించి ఎంతో విన్నా. ఇక్కడ పనిచేసే అవకాశం కోసం ఎదురుచూశా. డెవిల్ కథ విన్న వెంటనే.. నా టాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన ప్రాజెక్ట్ అనిపించింది. వెంటనే ఒప్పేసుకున్నా. నిజానికి నేను మాడలింగ్లోకి రావడం నాన్నకు అస్సలు ఇష్టంలేదు. కోపంతో కొన్ని వారాలపాటు నాతో మాట్లాడలేదు. అలిగి కూర్చున్నారు. అయినా నేను ఏమాత్రం నిరాశ పడలేదు. ఓ పెద్ద సంస్థ నుంచి మాడలింగ్ అవకాశం దక్కించుకొని.. నేనేంటో నిరూపించుకున్నా!
పాకిస్థానీ చిత్రం.. ‘మాన్ జావోనా’తో చిత్రసీమలో అడుగుపెట్టా! ఓటీటీ తో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చా. సాక్రెడ్ గేమ్స్, అభయ్ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు వచ్చింది. హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించా! ఇప్పుడు ‘డెవిల్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నా! నవాజుద్దీన్ సిద్ధిఖీ, జిమ్మీ షెర్గిల్తోనూ తెర పంచుకోబోతున్నా.