Kalki 2 | పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ చిత్రాల్లో కల్కి 2 ఒకటి. ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పటికే షూటింగ్ దశలో వేగంగా ముందుకెళుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ ఇప్పటికే షూటింగ్లో పాల్గొన్నట్టు సమాచారం. వీరి సీన్స్ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ ఎప్పుడు సెట్స్‌లోకి అడుగుపెడతాడన్న దానిపై నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, ‘డార్లింగ్’ ప్రభాస్ ఏప్రిల్ 10 నుంచి షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన పాత్ర ‘భైరవ’కు సంబంధించిన కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ ఎన్ని రోజులు కొనసాగుతుందో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇక ప్రభాస్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నాడు. దర్శకుడు హను రాఘవపూడి, అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వాల్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుల మధ్య సమన్వయం చేసుకుంటూ ‘కల్కి 2’ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సృష్టించిన హైప్‌ను మించి సీక్వెల్ ఉండబోతుందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పూర్తి స్థాయిలో షూటింగ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ‘కల్కి 2’ మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డెప్త్ తక్కువగా ఉందని మొదటి భాగంపై కొంతమంది అభిప్రాయపడిన నేపథ్యంలో, ఇప్పుడు కల్కి 2లో ఆ లోటును భర్తీ చేసేలా భారీ స్థాయిలో మహాభారత ఎపిసోడ్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సీక్వెల్లో దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగే మహాభారత ఘట్టాలు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. మొదటి భాగంలో కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే చూపించిన కురుక్షేత్ర యుద్ధం సన్నివేశాలు, ఈసారి మరింత విస్తృతంగా, గ్రాండ్‌గా తెరపై ఆవిష్కరించబోతున్నారని టాక్. ముఖ్యంగా అశ్వత్థామ శాపం, కర్ణుడు వీరత్వం, శ్రీకృష్ణుడు వ్యూహాలు వంటి కీలక అంశాలను ఈ ఎపిసోడ్లో చూపించనున్నట్లు సమాచారం. పురాణ కథనాలను ఆధునిక సైన్స్ ఫిక్షన్‌తో మేళవించిన తీరు భారతీయ సినీ చరిత్రలో కొత్త ట్రెండ్‌ను సృష్టించవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ 20 నిమిషాల ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు విభిన్నమైన విజువల్ అనుభూతిని అందించడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.