Jana Nayagan | కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు ముందే వరుస సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే సెన్సార్ అడ్డంకులు, కోర్టు కేసులతో ఆలస్యం అవుతున్న ఈ చిత్రం… తాజాగా ఆన్లైన్ లీక్ అవ్వడం మరింత కలకలం రేపింది. ఈ ఘటనతో సినిమా బృందానికి మరో షాక్ తగిలింది. ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన ప్రదీప్ ఈ రాఘవ్ పై చర్యలు తీసుకున్నారు. ఆయన కెరీర్లో ఇది 25వ చిత్రం కావడం గమనార్హం. అయితే సినిమా విడుదలకు ముందే లీక్ కావడంతో, ‘సదరన్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్’ ఆయనపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. లీక్ ఘటనకు ఆయన నిర్లక్ష్యం కూడా ఒక కారణమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
చెన్నై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘జన నాయగన్’ సినిమాకు పని చేసిన ఓ ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ అనధికారికంగా ఎడిటింగ్ రూమ్‌లోకి ప్రవేశించి, ఫుటేజీని చోరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరగడానికి భద్రతా లోపాలు కారణమని, అందులో భాగంగా ప్రదీప్ రాఘవ్ బాధ్యత కూడా ఉందని అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ కేసులో ప్రధాన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రదీప్ రాఘవ్ గతంలో అనేక విజయవంతమైన చిత్రాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తమిళంలో పలు హిట్ సినిమాలతో పాటు, తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు పని చేసి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులపై ఈ సస్పెన్షన్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2016లో విశాల్ నటించిన ‘కథకళి’ సినిమాతో ప్రదీప్ ఎడిటర్‌గా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. అనంతరం ‘కోమాలి’, ‘లవ్ టుడే’ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు ‘టిక్ టిక్ టిక్’, ‘గరుడన్’, ‘స్టార్’, ‘సార్ మేడమ్’, ‘డ్రాగన్’ వంటి సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తాజాగా విడుదలైన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రానికి కూడా ఆయనే ఎడిటర్‌గా పని చేశారు. తెలుగులో ‘నీవెవరో’, ‘మళ్లీ మొదలైంది’, ‘డార్లింగ్’ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు.