పాన్ ఇండియాను ఊపేసిన ‘పుష్ప’ను మనకు పరిచయం చేసింది అతనే! సీమ యాసలో కథనంతా నడిపించిన ఈ తెలంగాణ కుర్రాడికి స్టార్ హీరోకున్నంత ఫాలోయింగ్ ఉంది. నిజ జీవితంలో.. టీవీ చూసి నటుడవ్వాలని ఫిక్సయిన జగదీశ్ ప్రతాప్ అనుకున్నట్టుగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ సత్తా చాటుతున్నాడు. తాజాగా ‘సత్తిగాని రెండెకరాలు’ (ఆహా-ఓటీటీ) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరోవైపు ‘పుష్ప-2’లో కథను మరింత రక్తికట్టిస్తానని చెబుతున్న జగదీశ్ ప్రతాప్‌ను ‘జిందగీ’ పలకరించింది. ఆ కబుర్లు ఆయన మాటల్లోనే..
నటన నా ఒంట్లోనే ఉందనుకుంటా! మా బాపు చంద్రమౌళి పోస్టుమాస్టర్‌గా చేసేవాడు. ఆయన రంగస్థల నటుడు. మా ఊరు పేరు చెప్పలేదు కదూ! ఇప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకోడెపాక. అక్కడే మాకు ఐదెకరాల పొలం ఉండేది. మా అమ్మ లలిత పొలం చూసుకునేది. అమ్మతో కలిసి నేనూ పొలానికి వెళ్తుండేవాణ్ని. ఏదో వెళ్లి అలా తిరగడం కాదు, అమ్మతోపాటూ నేనూ పనిచేసేవాణ్ని. మరోవైపు నాన్న రంగస్థల కళాకారుడు కావడంతోనో ఏమో కానీ, నాలోనూ ఆయనకు నటుడు కనిపించాడు. పాఠశాల వార్షికోత్సవంలో నన్ను ఏదైనా స్కిట్ చేయమని ప్రోత్సహించేవాడు. ఏకపాత్రాభినయంలో శిక్షణ కూడా ఇచ్చేవాడు. ఇవన్నీ ఆసక్తిగానే చేసేవాణ్ని. టీవీలో సినిమాలు చూస్తున్నప్పుడు మాత్రం ఎలాగైనా నేనూ నటుణ్ని కావాలనిపించేది. ఇంటర్‌కు వచ్చాక సినిమాల్లోకి వెళ్లాలని బలంగా ఫిక్సయ్యా. ఇంతవరకు బాగానే ఉన్నా.. సినిమాల్లోకి వెళ్తానంటే చిన్నప్పుడు నన్ను ప్రోత్సహించిన నాన్న కూడా వద్దన్నాడు. నేను ఇంటికి దూరమవుతానని, సినిమాల్లో అవకాశాలు వస్తాయో రావో అని కంగారుపడ్డాడు. అందుకే కొంత అయిష్టంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బీఎస్సీ పౌల్ట్రీ టెక్నాలజీ పూర్తయ్యాక సినిమాల్లో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నా!
బాధ్యతగా భావిస్తున్నా
అనుకున్నట్టు జరిగితే జీవితంలో థ్రిల్ ఏం ఉంటుంది? రాసిపెట్టి ఉన్నది జరగాలన్నా మానవ ప్రయత్నం ఉండాలి కదా! నా వంతుగా సిన్సియర్‌గా ప్రయత్నాలు మొదలు పెట్టాను. షార్ట్ ఫిల్మ్స్ చేసేవాణ్ని. ఈ ప్రయాణంలో 2018లో మొదటిసారి ‘నిరుద్యోగ నటులు’ అనే యూట్యూబ్ షో రూపంలో ఓ అవకాశం తలుపుతట్టింది. తర్వాత ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’, ‘కొత్త పోరడు’ వెబ్‌సిరీస్‌లలో నటించాను. మరోవైపు ‘మల్లేశం’ సినిమాలో గుర్తుంచుకోదగ్గ పాత్ర దొరికింది. ‘పలాస 1978’తో నటుడిగా సెటిలవ్వొచ్చు అన్న నమ్మకం కలిగింది. ఇదే సమయంలో ‘పుష్ప’లో కేశవ పాత్ర వరించింది. నా ఆడిషన్ నచ్చి దర్శకుడు సుకుమార్ గారు కేశవ పాత్ర ఇచ్చారు. షూటింగ్ టైమ్‌లో నా పాత్రకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఆ చిత్రం విడుదల తర్వాత ఓవర్‌నైట్ సెలెబ్రిటీ అయిపోయా! ఇప్పుడు ‘పుష్ప-2’
షూటింగ్లో పాల్గొనేటప్పుడు బాధ్యతగా ఫీలవుతున్నా. కేశవ పాత్రను ప్రేక్షకులు మరింత ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నా!
హ్యాపీగా ఉంది
‘పుష్ప’ చిత్రంతో ఇండస్ట్రీలోనూ నేను ఉన్నానని అందరికీ తెలిసింది. ఇప్పుడు అవకాశాలు వెల్లు వెత్తుతున్నాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నాను. అలా వచ్చిన చిత్రమే ‘సత్తిగాని రెండెకరాలు’ చిత్రం. ఆహా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించింది. అందరూ బాగా చేశావని ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది. దర్శకుడు అభినవ్ దండాకు ధన్యవాదాలు చెప్పుకొంటున్నా. థియేటర్లో విడుదలైనా, ఓటీటీలో రిలీజైనా సినిమా సినిమానే! నటుడు నటుడే! మంచి నటుడు అనిపించుకోవాలనే తపనను ‘సత్తిగాని రెండెకరాలు’ తీర్చింది. నటుడు కావాలన్న నా కల నెరవేరింది. ఇక దర్శకుడిగా నిరూపించుకోవాలన్నది నా లక్ష్యం. ఇండస్ట్రీలో మరింత కుదురుకున్న తర్వాత మెగాఫోన్ పట్టుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తాను.