IMAX Hyderabad | హైదరాబాద్ సినీ ప్రియులకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏసియన్ సునీల్ (సునీల్ నారంగ్) తీపి కబురు అందించారు. భాగ్యనగరంలో సరికొత్త ఐమాక్స్ (IMAX) స్క్రీన్ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో రాబోతోందని ఆయన తన తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు. గత ఏడాది ఏషియన్ సినిమాస్, ఐమాక్స్ భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చలు నడిచినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఈసారి సునీల్ నారంగ్ స్వయంగా 4-5 రోజుల టైమ్ లైన్ ప్రకటించడంతో టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది.
ఒకప్పుడు ప్రసాద్స్ తన ఐమాక్స్ ద్వారా హైదరాబాద్ ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని అందించిన సంగతి తెలిసిందే. అయితే అది పీసీఎక్స్గా మారిన తర్వాత సిటీలో ప్రాపర్ ఐమాక్స్ స్క్రీన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబ్‌ట్రాటర్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’, అలాగే ‘రాకా’, ‘కల్కి 2’ వంటి భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ థియేటర్లలోకి రాబోతుండటంతో నగరానికి ఐమాక్స్ స్క్రీన్ ఖచ్చితంగా అవసరమని సినీ ప్రియులు భావిస్తున్నారు. గతంలో జరిగిన నిరాశల నేపథ్యంలో, ఈసారి ఏషియన్ గ్రూప్ ఈ ప్రతిష్టాత్మక స్క్రీన్‌ను హకీంపేట్ లేదా మరేదైనా కొత్త ప్రాంతంలో ఏర్పాటు చేయబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.