మహిళల్లో చాలా మందికి అందంగా కనిపించాలనే తపన ఉంటుంది. పసిడి వర్ణంలాంటి శరీరఛాయతో మెరిసిపోవాలని కలలు కంటుంటారు. అందుకే సౌందర్యోత్పత్తుల మార్కెట్‌కు దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే అందం, చక్కటి శరీరవర్ణం కోసం అర్రులు చాచటం వృథా ప్రయాస అని చెబుతోంది గోవా సొగసరి ఇలియానా. కేవలం శరీరఛాయ మాత్రమే సౌందర్యానికి నిర్వచనం కాదనే ఇతివృత్తంతో రూపొందిస్తున్న ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ చిత్రంలో ఈ భామ కథానాయికగా నటిస్తోంది. ఫెయిర్ స్కిన్ కోసం యువతీయువకులు తపించే ధోరణి..ఇందుకు కారణమవుతున్న మార్కెట్ కల్చర్‌పై వ్యంగ్యాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇలియానా మాట్లాడుతూ ‘రాత్రి వేళల్లో ఆకాశం చీకటిగానే ఉంటుంది. ఆ నిశీధిలోనే తారలు వెలుగుల్ని విరజిమ్ముతాయి. శారీరక రంగుకు, ఆకర్షణకు ఎలాంటి సంబంధం లేదని అందరూ తెలుసుకోవాలి. అలాంటి అద్భుతమైన కథతో ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ చిత్రం తెరకెక్కుతోంది. ఓ సున్నితమైన అంశాన్ని వినోదం కలబోసి మానవీయ కోణంలో చెప్పబోతున్నాం. శరీరఛాయ తాలూకు దేశంలో నెలకొని ఉన్న వివక్ష, అపోహల్ని ఈ సినిమా పటాపంచలు చేస్తుంది’ అని చెప్పింది. రణ్దీప్హుడా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బల్వీందర్‌సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.