‘ఓ గొప్ప చరిత్రకు తెరరూపం ‘రజాకార్’. అలాంటి సినిమాలో నాకూ స్థానం దొరకడం, నా పాత్రకు మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది’ అంటున్నది నటి అనుశ్రీ. యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ‘రజాకార్’ చిత్రంలో కీలకపాత్ర పోషించింది అనుశ్రీ. ఈ సినిమాలోని తన పాత్రకు వస్తున్న స్పందనపై ఆనందాన్ని వ్యక్తంచేస్తూ విలేకరులతో ముచ్చటించింది అనుశ్రీ. ‘మాది బెంగళూరు. అక్కడే చదివాను. థియేటర్స్ ఆర్టిస్టుని. మోడలింగ్ కూడా చేశాను. 2018లో చత్తీస్ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. నాన్నకేమో నాతో సివిల్స్ చేయించాలని కోరిక. నాకేమో నటన అంటే ప్రాణం.అందుకే హైదరాబాద్ వచ్చేశాను. ఇక్కడే థియేటర్స్ వర్క్‌షాప్ చేశాను. దర్శకుడు యాటాగారు నిజాం భార్య పాత్ర కోసం వెతుకుతున్నారని తెలిసి వెళ్లి సంప్రదించాను. మకరంద్ దేశ్‌పాండే గారితో లుక్‌టెస్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాతనే నన్ను ఎంపిక చేశారు. అలా నన్ను ఆ పాత్ర వరించింది. చాలా సున్నితమైన పాత్ర అది. వాస్తవ పరిస్థితులు నిజాంకు తెలిపే పాత్ర. అందుకే సవాల్‌గా తీసుకొని చేశాను. ఈ పాత్రకోసం మూడు నెలలు మెథడ్ యాక్టింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. బాబీసింహా, రాజ్ అర్జున్, మకరంద్‌దేశ్‌పాండే లాంటి గొప్ప నటులతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం. భవిష్యత్తులో మంచి పాత్రలు పోషించాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది అనుశ్రీ.