‘హాలీవుడ్ చిత్రం ‘ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ చూస్తే ఎలా అనిపిస్తుందో ‘యానిమల్’ చూస్తే అలా అనిపించింది. ఇది భిన్నమైన చిత్రం. కథ, కథనం, సంగీతం.. ఇలా అన్ని విషయాల్లో ఈ సినిమా నాకు నచ్చింది’ అంటున్నది బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సందీప్‌రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.
‘యానిమల్’ చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను. అలాంటి సినిమాల్లో నటించాలనేది నా కోరిక. ఆ అవకాశం వస్తే మాత్రం వదులుకోను. నేనైతే అన్ని రకాల సినిమాల్లో నటిస్తా.. చూడ్డం, చూడకపోవడం ప్రేక్షకుల ఇష్టం. సినిమా సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుందంటే నేను నమ్మను. ఎన్నో ప్రభావవంతమైన సినిమాలొచ్చినా సమాజంలో వచ్చిన మార్పేమీ లేదు. అందుకే.. సినిమాపై వచ్చే ప్రశంసల్నీ, విమర్శల్నీ నేను పట్టించుకోను. ప్రేక్షకులు చూస్తున్నంతకాలం సినిమాలు వస్తూనేవుంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది హ్యూమా ఖురేషి.