Huma Qureshi | ఇటీవల సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుసగా పలువురు హీరోలు, హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగుపెడుతుండగా, ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఈ జాబితాలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి త్వరలో పెళ్లి చేసుకోనుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన హ్యూమా ఖురేషి, తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా మహారాణి వెబ్ సిరీస్ ద్వారా ఆమెకు విపరీతమైన స్టార్డమ్ వచ్చింది. ఈ సిరీస్‌లో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ, తన నటనతో ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది.
వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, హ్యూమా ఖురేషి గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రచిత్ సింగ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి ప్రేమ కథ బాలీవుడ్లో ఓపెన్ సీక్రెట్‌గా మారిందని చెప్పాలి. ఇద్దరూ కలిసి అనేక ఈవెంట్స్, పార్టీల్లో కనిపించడం, సోషల్ మీడియాలో కూడా ఒకరిపై ఒకరు అభిమానాన్ని వ్యక్తం చేయడం వలన వారి రిలేషన్‌షిప్‌పై స్పష్టత వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఒక స్నేహితుడి పెళ్లి వేడుకలో ఈ ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారని తెలుస్తోంది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి, తర్వాత ప్రేమగా మారింది. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఈ జంట ఇప్పుడు తమ బంధాన్ని వివాహంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్‌లో హ్యూమా ఖురేషి – రచిత్ సింగ్ వివాహం జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహిస్తారా? లేక ఇతర సెలబ్రిటీల మాదిరిగానే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బాలీవుడ్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ జంట కూడా అదే బాటలో నడుస్తుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు, ఈ పెళ్లి వార్తలపై హ్యూమా ఖురేషి లేదా రచిత్ సింగ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు వైరల్ అవుతుండగా, అభిమానులు ఇప్పటికే ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజంగా ఈ వార్తలు నిజమైతే, త్వరలోనే బాలీవుడ్లో మరో గ్రాండ్ వెడ్డింగ్ చూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.