Indian Cinema | ‘ఇంట గెలిచి రచ్చ గెలవాల’న్న సామెత భారతీయ సినిమాకు అతికినట్టు సరిపోతున్నది. ఇటీవల ఇక్కడ విడుదలైన సినిమాలు విదేశాల్లోనూ ఓ రేంజ్లో వసూళ్లు రాబడుతున్నాయి. హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలూ విదేశాల్లో మంచి ఓపెనింగ్స్తోపాటు రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఫైటర్, హనుమాన్, మలయాళ చిత్రం మలైకొట్టాయ్ వాలిబన్ తదితర సినిమాలు ఎల్లలు దాటి కమర్షియల్గా విజయాన్ని అందుకున్నాయి.
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో విడుదలై ఎన్ఆర్ఐలతోపాటు అక్కడి వారినీ అలరిస్తున్నాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకోణ్ జంటగా నటించిన ‘ఫైటర్’ ఓవర్సీస్లో రూ.94 కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘తేరీ బాతోఁమే ఐసా ఉల్ఝా జియా’ వారం రోజుల్లోనే రూ.20 కోట్లు రాబట్టింది.
షారుఖ్ ఖాన్ లేటెస్ట్ చిత్రం ‘డంకీ’కి ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చినా.. విదేశాల్లో గట్టిగానే కలెక్షన్లు రాబట్టింది. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ కూడా విదేశాల్లో విక్టరీ సాధించింది. ఇటీవల సంచలనాత్మక విజయం సాధించిన చిన్న సినిమా ‘ట్వెల్త్ ఫెయిల్’ విదేశాల్లో రూ.2 కోట్లు సాధించింది. పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్న తెలుగు చిత్రాలు ఓవర్సీస్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.