భారతీయ తారలకు హాలీవుడ్ డ్రీమ్స్ కొత్తేమీ కాదు. దేశీయ సినిమాలో చక్కటి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న తారలు కొందరు హాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అంతర్జాతీయ స్థాయి పాపులారిటీతో పాటు ఆర్థికంగా కూడా భారీ మొత్తంలో ఆర్జించే అవకాశం ఉండటంతో హాలీవుడ్ యవనికపై మెరిసి పోవాలని సినీ తారలు కలలు కంటుంటారు. ఈ నేపథ్యంలో సమకాలీన భారతీయ సినిమాలో కొందరు అగ్ర నటీనటులు హాలీవుడ్ వైపు అడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. లోకల్ సినిమాలో రాణిస్తూనే గ్లోబల్‌గా తమదైన ప్రత్యేకతను చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలుగుతున్న తారలు తమ తదుపరి గమ్యంగా హాలీవుడ్‌ను ఎంచుకుంటారు. అనుపమ్‌ఖేర్, ఐశ్వర్యరాయ్, ప్రియాంకచోప్రా, దీపికా పడుకోన్, నవాజుద్దీన్ సిద్ధ్ధిఖీ, నసీరుద్దీన్‌షా, ఇర్ఫాన్‌ఖాన్ వంటి నటీనటులెందరో హాలీవుడ్లో సత్తాచాటారు. హిందీ సినీ రంగంలో అగ్ర నాయికగా విరాజిల్లుతున్న తరుణంలోనే ఐశ్వర్యరాయ్ హాలీవుడ్లో ‘మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్’‘బ్రైడ్ అండ్ ప్రెజుడీస్’ ‘పింక్ పాంథర్-2’ వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఐశ్వర్యరాయ్ బాటలోనే ప్రస్తుతం ప్రియాంకచోప్రా, దీపికాపడుకోన్ హాలీవుడ్లో నాయికలుగా రాణిస్తున్నారు. తాజాగా వీరి బాటలో అలియాభట్, హృతిక్ రోషన్, ధనుష్, సమంత హాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు.
బాలీవుడ్ చిత్రసీమలో కథానాయికగా పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది అలియాభట్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మొదలుకొని ‘గంగూబాయి కతియావాడి’ వరకు ఆమె కెరీర్లో ఎన్నో భారీ విజయాలున్నాయి. హిందీ పరిశ్రమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్న అలియాభట్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రం ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నది. గాల్ గాడాట్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్రిటీష్ ఫిల్మ్ మేకర్ టామ్ హార్పర్ దర్శకత్వం వహిస్తున్నారు. గూఢచారి థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ మార్చిలో మొదలైంది.
గత రెండు దశాబ్దాలుగా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితురాలిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన తమిళ సోయగం సమంత..‘ఫ్యామిలీమెన్-2’ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇప్పుడీ భామ ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే చిత్రం ద్వారా హాలీవుడ్లో అడుగుపెట్టతోతున్నది. ఫిలిప్‌జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత సొంతంగా డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వహించే తమిళ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. హాలీవుడ్ అరంగేట్రం పట్ల సమంత ఆనందం వ్యక్తం చేసింది. ‘నిజంగా ఇది గొప్ప అవకాశం. ఛాలెంజింగ్ రోల్‌తో హాలీవుడ్లో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది’ అని సమంత పేర్కొంది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.
వినూత్న కథా చిత్రాలతో దక్షిణాదిన అగ్ర హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ధనుష్. కెరీర్ పరంగా ప్రయోగాలకు పెద్దపీట వేసే ఆయన ‘ది గ్రే మెన్’ చిత్రంతో హలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రేయాన్ గాస్లింగ్, క్రిస్ ఇవాన్స్ వంటి హాలీవుడ్ హీరోలతో కలిసి నటిస్తున్నారు ధనుష్. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలైలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
బాలీవుడ్ అగ్రహీరో హృతిక్ రోషన్ ఓ స్పై థ్రిల్లర్ చిత్రం ద్వారా హాలీవుడ్లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అమెరికాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ హృతిక్‌తో సంప్రదింపులు జరుపుతున్నదని, త్వరలో ఆయన హాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. వీరి కోవలోనే మరింకొంత మంది భారతీయ తారలు కూడా హాలీవుడ్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.