‘హైవే నేపథ్యంలో సాగే ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంతం అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు కేవీ గుహన్. ఆయన దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హైవే’. మానస రాధాకృష్ణన్ కథానాయిక. వెంకట్ తలారి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో చిత్రీకరణ జరిపాం. హైవేలో ఏం జరిగిందన్నది ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ఇందులో ప్రముఖ నటీనటులు నటించారు. వారి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని చెప్పారు. కథ, కథనాలతో పాటు తన పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందని హీరో ఆనంద్ దేవరకొండ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సైమన్కింగ్, నిర్మాణ సంస్థ: శ్రీఐశ్వర్య లక్ష్మీమూవీస్, కథ, స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కె.వి.గుహన్.