Hi Nanna | కథల ఎంపికలో కొత్తదనంతో పాటు పాత్రలపరంగా వైవిధ్యాన్ని చూపిస్తుంటారు హీరో నాని. ప్రస్తుతం ఆయన 30వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డా॥ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘హాయ్ నాన్న’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. దక్షిణాది భాషల్లో ‘హాయ్ నాన్న’, హిందీలో ‘హాయ్ పాపా’ అనే టైటిల్‌ను పెట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది.
ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో నాని భుజాలపై ఓ పాప కూర్చొని ఉండగా, వారిద్దరి వెనక కథానాయిక మృణాల్ ఠాకూర్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నది. ‘తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఆద్యంతం హృద్యంగా సాగే చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నాం. డిసెంబర్ 21న విడుదల చేస్తాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, దర్శకత్వం: శౌర్యువ్.